BCCI : వేలకోట్ల ఆదాయం.. మైదానాలేమో దయనీయం.. బీసీసీఐ సిగ్గుపడాల్సిన విషయం ఇది..

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కూడా వర్షార్పణమైంది. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : September 29, 2024 10:10 pm
Follow us on

BCCI : తొలిరోజు ఆటలో 55 ఓవర్లు వరుణుడి ఖాతాలో చేరిపోయాయి. రెండవ రోజు ఒక్క బంతి కూడా పడలేదు. మూడో రోజు వర్షం కురువక పోయినప్పటికీ మైదానంలో అవుట్ ఫీల్డ్ చిన్నపాటి చెరువును తలపించింది. అవుట్ ఫీల్డ్ పూర్తిగా చిత్తడిగా మారడంతో అంపైర్లు చేసేది ఏమీ లేక ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురువడంతో అవుట్ ఫీల్డ్ మొత్తం నేటితో నిండిపోయింది. మైదాన సిబ్బంది ఆ నీటిని తొలగించడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా ఇరుజట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఈ స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే వరద నీరు బయటికి వెళ్లే మార్గం లేకుండా పోయిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉంటే నీళ్లు ఇలా నిలిచి ఉండేవి కావని వ్యాఖ్యానిస్తున్నారు. వాన నీరు ఎక్కడికి అక్కడే నిలిచిపోవడంతో అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది.

సిబ్బంది ప్రయత్నించినప్పటికీ..

చిత్తడిగా మారిన అవుట్ ఫీల్డ్ ను ఆరబెట్టడానికి మైదాన సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఇలా ప్రయత్నిస్తున్న క్రమంలో మైదానంలో సిబ్బంది కాళ్లు దిగబడిపోయాయి. ఈ క్రమంలో మైదానాన్ని అంపైర్లు అనేకసార్లు సందర్శించారు. మైదానం పరిస్థితి చూసి ఆటను కొనసాగించడం కష్టమనే నిర్ణయానికి వచ్చారు. ” కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుంది. ఐపీఎల్ నుంచి మొదలు పెడితే మిగతా మ్యాచ్ ల వరకు విపరీతమైన ఆదాయం వస్తుంది. అయినప్పటికీ బీసీసీఐ కి మైదానాలు బాగు చేసుకోవాలనే సోయి లేదు. చివరికి డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. అందువల్లే వాన నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక మ్యాచ్ నోయిడాలో నిర్వహించాలని భావించారు. దానికి బీసీసీఐ ఓకే చెప్పింది. కానీ వర్షం వల్ల నోయిడా మైదానం చిత్తడిగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఏకైక టెస్ట్ రద్దయింది.. దీంతో మరోసారి భారత్ లో ఆడబోమని ఆఫ్ఘనిస్తాన్ జట్టు చెప్పింది. దీనిని ఉదాహరణగా తీసుకోనైనా బీసీసీఐ ఏర్పాట్లు చేయాల్సి ఉండేది. కానీ ఆ దిశగా బీసీసీఐ ఆలోచించలేదు. అయినా బీసీసీఐకి డబ్బులు మాత్రమే కావాలి.. మైదానాల్లో సౌకర్యాలు ఎందుకని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా బీసీసీఐ మైదానాలపై దృష్టి సారించాలని.. సౌకర్యాలను కల్పించాలని.. లేనిపక్షంలో ఇలానే ఇబ్బంది పడాల్సి ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయి మైదానాలను నిర్మించాలని.. అప్పుడే క్రికెట్ లో భారత్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని చెబుతున్నారు.