USA Vs Pakistan: పాక్ జట్టయితే ఏంటి.. అరగంటలో ఓడించగలం..

టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అమెరికా జట్టు బంగ్లాదేశ్ తో మూడు టి20 ల సిరీస్ ను దక్కించుకుంది. పాకిస్తాన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో ఆడింది. ఇంగ్లాండ్ జట్టుతో రెండు మ్యాచులు వర్షం వల్ల రద్దుకాగా.. మిగతా మ్యాచ్లలో పాకిస్తాన్ ఓడిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 6, 2024 6:22 pm

USA Vs Pakistan

Follow us on

USA Vs Pakistan: టి20 వరల్డ్ కప్ ఇప్పుడిప్పుడే ఆసక్తికర మ్యాచ్లకు సిద్ధమవుతోంది. ఈ పొట్టి సమరంలో డల్లాస్ వేదికగా గ్రూప్ – ఏ లో ఉన్న అమెరికా, పాకిస్తాన్ గురువారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సూపర్ -8 కు వెళ్లాలంటే అమెరికాకు ఈ మ్యాచ్లో గెలవడం ఎంతో ముఖ్యం. అయితే పాకిస్తాన్ జట్టును ఓడించడం అమెరికాకు అంత సులువు కాదు. బౌలింగ్, బ్యాటింగ్ లో అమెరికా కంటే పాకిస్తాన్ ముందంజలో ఉంది.

బలంగా కనిపిస్తున్న పాకిస్తాన్ జట్టును కచ్చితంగా ఓడిస్తామని అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ చెబుతున్నాడు. పాకిస్తాన్ జట్టును అరగంటలో చిత్తు చేస్తామని చెబుతున్నాడు.. టి20 క్రికెట్ మ్యాచ్లో పరిణామాలు ఎటువైపైనా దారితీస్తాయని.. స్థిరమైన ఆట తీరు ప్రదర్శిస్తే గెలవడం అసాధ్యం కాదని అతడు పేర్కొన్నాడు..”పాకిస్తాన్ జట్టుతో ఆడే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇటీవల బంగ్లాదేశ్ ను ఓడించాం. మా దగ్గర శక్తిసామర్థ్యాలు చాలా ఉన్నాయి. ఆట మీద 40 నిమిషాల పాటు సరైన అంచనా కలిగి ఉండి.. అద్భుతమైన ప్రదర్శన చేస్తే చాలు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇలాంటి సమయంలో మ్యాచ్ గెలవడం పెద్ద కష్టం కాదని” మోనాన్క్ అన్నాడు.

ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అమెరికా జట్టు బంగ్లాదేశ్ తో మూడు టి20 ల సిరీస్ ను దక్కించుకుంది. పాకిస్తాన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో ఆడింది. ఇంగ్లాండ్ జట్టుతో రెండు మ్యాచులు వర్షం వల్ల రద్దుకాగా.. మిగతా మ్యాచ్లలో పాకిస్తాన్ ఓడిపోయింది . ఐర్లాండ్ జట్టుతో జరిగిన మూడు టి20లో సిరీస్ లో.. మొదటి మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్.. తదుపరి రెండు మ్యాచ్లు గెలిచింది. అమెరికా హెచ్చరికలను సవాల్ గా తీసుకుంటేనే పాకిస్తాన్ జట్టుకు గెలుపు సాధ్యమవుతుంది. అమెరికాను ఒకవేళ పసికూనగా భావిస్తే మాత్రం పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.. ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో అమెరికా కెనడాపై రికార్డు స్థాయిలో చేజింగ్ చేసింది. ఇదే ఊపులో పాకిస్తాన్ పై గెలవాలని భావిస్తోంది.