Pakistan Cricket : స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ను పాకిస్తాన్ 2-0 తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నుంచి కూడా ఎగ్జిట్ అయింది. అంతేకాదు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ర్యాకింగ్స్ లో 8 వ స్థానానికి పడిపోయింది. దీంతో నెట్టింట పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “రావల్పిండి లో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వీర లెవెల్ లో ఆడారు. త్వరగా గెలవాలనే ఉద్దేశంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఈ సమయంలో మీ విజయం పై పెద్దగా అనుమానాలు లేవు. కానీ మీ దిక్కుమాలిన ఆట తీరు వల్ల 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ ఇదే మైదానం వేదికగా రెండవ టెస్టు ఆడారు. తొలి ఇన్నింగ్స్ లో 274 రన్స్ చేశారు. ఈ దశలో మీ బౌలర్లు విజృంభించారు. బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించారు. 26 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో మళ్లీ మీరు విజయం సాధిస్తారని అనుకున్నాం. కానీ ఈ టెస్ట్ లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయారు. రెండు టెస్టులలో ఏకంగా చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ లను పోగొట్టుకున్నారు.. ఇంతకు మించిన దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? స్వదేశంలో బంగ్లా జట్టుతో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. మీకెందుకురా క్రికెట్” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆ బలం ఏమైంది
సహజంగా స్వదేశంలో ఏ జట్టైనా బలంగా ఉంటుంది. అక్కడిదాకా ఎందుకు? టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా జింబాబ్వే తో తలపడింది. 5 t20 మ్యాచ్ లు ఆడింది. అయితే తొలి మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధించింది. టీమిండియా స్టార్ ఆటగాళ్ళను పంపకపోయినప్పటికీ ఓటమి ఓటమే. ఈ చిన్న ఉదాహరణ చాలు స్వ దేశంలో ఏ జట్టైనా బలంగా ఉంటుందని చెప్పేందుకు. కానీ ఇదే బలాన్ని పాకిస్తాన్ స్వదేశంలో నిరూపించుకోలేకపోయింది. వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లూ చేతుల్లోకి వచ్చినా నిర్లక్ష్యంగా వదిలేసుకుంది. పాకిస్తాన్ ఈ తీరుగా ఓడిపోవడం పట్ల ఆ జట్టు స్టార్ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ముఖ్యంగా రెండవ టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 274 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ 262 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఈ దశలో బంగ్లాదేశ్ 22 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి దారుణమైన కష్టాల్లో పడింది. ఈ దశలో బంగ్లాదేశ్ జట్టును లిటన్ దాస్ (138) అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇతడికి మిరాజ్ (78) తోడయ్యాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే బంగ్లాదేశ్ వెనుకబడింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 172 రన్స్ మాత్రమే చేయగలిగింది.. ఇక పాకిస్తాన్ విధించిన 185 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఏకంగా ఐసీసీ టెస్ట్ జట్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్ త్వరలో టీమ్ ఇండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.