Australia vs India బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లను టీమిండియా ఆటగాళ్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. తొలి టెస్ట్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను స్టార్క్ ను ఎలా ఆటపట్టించాడో అందరికీ తెలిసిందే. “నీ బౌలింగ్లో వేగం తగ్గింది.. బంతిని అత్యంత వేగంగా నాపై సంధించు” అని అన్నాడు. అంతకుముందు హర్షిత్ రాణా బౌలింగ్ ను ఉద్దేశించి మెచ్చుకున్నాడు స్టార్క్. ఇక రెండో టెస్టులో లబూ షేన్ ను దాదాపు కొట్టినంత పని చేశాడు సిరాజ్. అతడు బౌలింగ్ వేస్తుండగా లబూ షేన్ మధ్యలో కల్పించుకొని.. ఆపమని సైగ చేశాడు. దీంతో సిరాజ్ కోపంతో బంతిని వికెట్ల వైపు గట్టిగా విసిరి కొట్టాడు. దీంతో లబూ షేన్ భయపడిపోయాడు. బాబోయ్ ఇతడితో ఎందుకు అనవసరమైన గొడవ అంటూ సైలెంట్ అయిపోయాడు.
హెడ్ దిగి వచ్చాడు
శనివారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో హెడ్, సిరాజ్ మధ్య వివాదం జరిగింది. సిరాజ్ ను ఉద్రేక పరిచే విధంగా హెడ్ వ్యవహరించాడు. సిరాజ్ బౌలింగ్ లో హెడ్ వీర విహారం చేశాడు. ఒక ఫోర్, సిక్సర్ కొట్టి చూసావా నా బ్యాటింగ్ ఎలా ఉందో అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. దీనికి ఒళ్ళు మండిపోయిన సిరాజ్.. మరుసటి బంతికి హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో హెడ్ మైదానం నుంచి వెళ్ళిపోతుండగా.. వెళ్ళు వెళ్ళు అంటూ సిరాజ్ గట్టిగా అరిచాడు. దీంతో నెట్టింట హెడ్ పై విమర్శలు మొదలయ్యాయి. అనవసరంగా కయ్యానికి కాలు దువ్వాడని ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఇదేదో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అనుకున్న హెడ్.. ఈ వివాదానికి ముగింపు పలకాలని భావించాడు. ఇందులో భాగంగానే సిరాజ్ ను తాను ఏమీ అనలేదని వివరణ ఇచ్చాడు. “నేను అతడిని ఏమీ అనలేదు. బౌలింగ్ బాగా చేసావని మెచ్చుకున్నాను అంతే. దానిని వేరే విధంగా తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే నేనేమీ చేయలేను. తోటి ఆటగాడిని అభినందించడం తప్పు ఎలా అవుతుందని” హెడ్ వ్యాఖ్యానించాడు. హెడ్ వ్యాఖ్యల నేపథ్యంలో సరికొత్త చర్చ మొదలైంది. టీమిండి ఆటగాళ్లు ఈసారి అత్యంత దురుసుగా ఉండడంతో.. వారిని తట్టుకోలేక ఆస్ట్రేలియా ఆటగాళ్లు తలవంచుకొని వెళ్తున్నారని.. ఏకంగా వివరణలు కూడా ఇస్తున్నారని స్పోర్ట్స్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మునుపెన్నడూ ఈ ధోరణి చూడలేదని వారు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు టీమిండియా ఆటగాళ్లు సరైన సమాధానం చెబుతుండడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని.. చివరికి ఆస్ట్రేలియా మీడియా కూడా సైలెంట్ అయిపోయిందని వారు ఈ సందర్భంగా వివరిస్తున్నారు.