https://oktelugu.com/

Australia vs India : రోహిత్ శర్మ ఎందుకిలా ఆడుతున్నాడు? కమిన్స్ కే ఎందుకు దొరికిపోతున్నాడు..

పెర్త్ టెస్టులో టీమిండియా గెలిచింది. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కు రాహుల్ - యశస్వి జైస్వాల్ ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ అయింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2024 / 10:33 PM IST

    Rohith Sharma

    Follow us on

    Australia vs India, రాహుల్, యశస్వి జైస్వాల్ నెలకొల్పిన భాగస్వామ్యం టీమిండియాను గెలుపు దారి పట్టించింది. అయితే ఇదే సెంటిమెంట్ ను టీం ఇండియా మేనేజ్మెంట్ రెండో టెస్టులోనూ కొనసాగించింది. ఫలితంగా కెప్టెన్ రోహిత్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ప్రయోగం అడిలైడ్ లో వర్కౌట్ అవ్వలేదు. ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ రెండు ఇన్నింగ్స్ లలోనూ విఫలమయ్యారు. ముఖ్యంగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు.. రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో పర్వాలేదు అనిపించినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేశాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. దృఢంగా ఆడాల్సిన రోహిత్.. మరోసారి తన చెత్త ఆటను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్, రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే సీన్ కంటిన్యూ చేశాడు. ఫలితంగా టీమిండియా అడిలైడ్ లో ఓటమి అంచులో నిలిచింది.. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ లో రోహిత్ ఆడిన ఆట చూస్తే జాలి కలగక మానదు. ఒకటి అంటే ఒకటే బౌండరీ సాధించిన అతడు.. క్రీజ్ లో ఉండేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బంతులను ఎదుర్కోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. కమిన్స్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి వికెట్ సమర్పించుకున్నాడు.

    మిడిల్ ఆర్డర్లో వచ్చినప్పటికీ..

    ఇటీవల న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. తొలిసారి క్రికెట్ ఆడుతున్న ఆటగాడిలాగా వికెట్ పడేసుకున్నాడు. కాస్తలో కాస్తయినా ప్రతిఘటన చూపించలేక చేతులెత్తేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ లోనూ అదే సీన్ కంటిన్యూ చేస్తున్నాడు. అసలు ఆడుతుంది రోహిత్తేనా అనే అనుమానం కలిగిస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం మిడిల్ ఆర్డర్లో రోహిత్ ఆడాడు. ఆ తర్వాత ఓపెనర్ గా వచ్చాడు.. తనకు మాత్రమే సాధ్యమైన అసాధారణ ఆట తీరును ప్రదర్శించాడు. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్లో ఇన్నాళ్లకు ఆడుతున్న రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ ఇప్పటివరకు 31 టెస్ట్ మ్యాచ్ లలో మిడిల్ ఆర్డర్ ఆడాడు. మూడో స్థానంలో నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఒకే ఒక్క అర్థ సెంచరీ చేశాడు. నాలుగు స్థానాల్లో ఆడినప్పుడు ఒక మ్యాచ్లో 64 రన్స్ చేశాడు. ఐదో స్థానంలో 9 మ్యాచులు ఆడి మూడు హాఫ్ సెంచరీలు చేసి, 437 రన్స్ చేశాడు. ఆరవ స్థానంలో 16 మ్యాచ్ లు ఆడి, మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలతో 1037 పరుగులు చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్లో నాలుగు సార్లు రోహిత్ సున్నా పరుగులకే వెనుతిరిగాడు.

    కమిన్స్ కు దొరికిపోయాడు

    అడిలైడ్ రెండో టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లో రోహిత్ కమిన్స్ కు దొరికిపోయాడు. టెస్టులలో ఇతడి చేతిలో రోహిత్ కావడం ఇది ఐదవ సారి. మొత్తంగా పదకొండు ఇన్నింగ్స్ లలో కమిన్స్ సంధించిన 184 బంతులలో 120 రన్స్ చేసిన రోహిత్.. ఐదుసార్లు అవుట్ అయ్యాడు. అడిలైడ్ టెస్ట్ లోనూ రోహిత్ కమిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు ఔట్ కావడంతో టీమిండియా కష్టాలు మరింత పెరిగాయి. అయితే యువ ఆటగాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా.. ఆస్ట్రేలియా బౌలర్లను గట్టిగానే ప్రతిఘటించారు.