https://oktelugu.com/

Gautham Gambhir : శ్రీలంక పరువు తీసింది.. న్యూజిలాండ్ గర్వభంగం చేసింది.. గంభీర్ సార్.. ఇదా మీ శిక్షణ?

టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతామని చెప్పారు. అందుకే టెస్ట్ ఆడే ఆటగాళ్లు మొత్తం రంజీలో సత్తా చాటాలని షరతు విధించారు. ఇందులో విరాట్, రోహిత్, బుమ్రా కు మినహాయింపు ఇచ్చారు. కానీ చివరికి ఏం జరిగింది?

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 3, 2024 / 04:25 PM IST

    Gautham Gambhir

    Follow us on

    Gautham Gambhir :  స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో భారత్ కోల్పోయింది. భారత్ ఓడిపోయింది అనేదానికంటే చేతులారా న్యూజిలాండ్ జట్టుకు సిరీస్ అప్పగించింది అని చెప్పడం సబబు. సాధారణంగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను అద్భుతంగా ఆడుతారు. కానీ కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నారు. అయితే టి20 క్రికెట్ కు ఆటగాళ్లు విపరీతంగా అలవాటు పోవడంతో క్రీజ్ లో పాతుకు పోవడానికి అయిష్టతను చూపిస్తున్నారు. టెస్ట్ క్రికెట్లో స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. ఫుట్ వర్క్, షాట్ల ఎంపిక అనేది అత్యవసరం. కానీ ఈ విషయాలను టీమిండి ఆటగాళ్లు పూర్తిగా విస్మరించారు. బెంగళూరులో 46 పరుగులకు ఆల్ అవుట్ పరువు తీసుకున్న.. టీమిండియా ఆటగాళ్లు.. ఆ తర్వాత మిగతా టెస్ట్ లలోనూ అదే ఆట తీరును ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యంత దారుణంగా ఆడారు. ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయారు. వారిద్దరూ అలా అవుట్ కావడం టీమిండియా విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపించింది.. అనామక బౌలర్ల చేతిలో టీమిండియా ఆటగాళ్లు అవుట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    గౌతమ్ గంభీర్ పై విమర్శలు..

    గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో కోల్ కతా జట్టును విజేతగా నిలపడంతో.. బీసీసీఐ అతడిని కోచ్ గా నియమించుకుంది. హేమాహేమిల్లాంటి ఆటగాళ్లను కాదని గౌతమ్ గంభీర్ ను కోచ్ గా నియమించింది. శ్రీలంక టూర్ ద్వారా గౌతమ్ గంభీర్ కోచ్ గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసినప్పటికీ… వన్డే సిరీస్ లో భారత్ వైట్ వాష్ కు గురైంది. అప్పుడే భారత ఆటగాళ్ల స్పిన్ లోపం బయటపడింది. ముఖ్యంగా దునిత్ వెల్లాలగే బౌలింగ్ లో భారత ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుకోవడం మేనేజ్మెంట్ ను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. టీమ్ ఇండియాను వన్డే సిరీస్లో వైట్ వాష్ చేయడం ద్వారా శ్రీలంక జట్టు 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టుకు 45 రోజుల విరామం లభించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్, టి20 సిరీస్ ఆడింది. టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. టి20 సిరీస్ లో కూడా అదే ఫలితాన్ని నమోదు చేసింది. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా రోహిత్, విరాట్ గల్లి స్థాయిలో క్రికెట్ ఆడారు. అది జట్టు విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపించింది. వాస్తవానికి గౌతమ్ గంభీర్ కోచింగ్ విషయంలో కఠినంగా ఉంటాడని పేరున్నప్పటికీ.. అది ఫలితాలను ఇవ్వడం లేదు.

    రంజీలో ఆడినప్పటికీ..

    బంగ్లాదేశ్ సిరీస్ కంటే ముందు ఆటగాళ్లు రంజీ ఆడాలని షరతు విధించారు. కానీ అందులో ప్రతిభ చూపించిన ఆటగాళ్లను జట్టు మేనేజ్మెంట్ విస్మరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సిరీస్లో బుమ్రా, రోహిత్, విరాట్ కు విశ్రాంతి ఇవ్వాలని ముందుగా జట్టు మేనేజ్మెంట్ భావించింది. కానీ ఆ తర్వాత వారికి అవకాశం కల్పించింది. అయినప్పటికీ వారి పెద్దగా ప్రభావం చూపించిన దాఖలాలు లేవు. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, గిల్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ వాటి వారు మాత్రమే జట్టులో కాస్తో కూస్తో ఆడారు. మిగతా వాళ్ళంతా దారుణంగా విఫలమయ్యారు. అందువల్లే జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ తన కోచింగ్ విధానంలో సమూల మార్పులు చేపడితేనే జట్టు గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు..