Gary Kirsten: మీ జట్టుకో దండం.. నేను ఇక వేగలేను.. రాజీనామా చేసిన క్రికెట్ జట్టు కోచ్

"మీ జట్టుకో దండం. మీతో నేను ఇక వేయగలేను. ఎన్నిసార్లు చెప్పినా మీరు తీరు మార్చుకోలేరు. అందుకే ఇకపై వెళ్ళిపోతున్నాను" అంటూ ఆ జట్టు క్రికెట్ కోచ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 28, 2024 4:37 pm

Gary Kirsten

Follow us on

Gary Kirsten: గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆటగాళ్లలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వెళ్లాయి. ఈ క్రమంలో జట్టు మెగా టోర్నీలలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. స్వదేశంలోనూ వరుసగా టోర్నీలను పర్యాటక జట్లకు అప్పగించింది. ఈ క్రమంలో ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మొదటి టెస్టులోనూ ఓటమిపాలైంది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 0-2 తేడాతో కోల్పోయింది. ఇన్ని పరిణామాలు ఆ జట్టు భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో పాకిస్తాన్ జట్టు కోచ్ గా కిర్ స్టెన్ ను నియమించారు. ఆరు నెలల క్రితం ఆయన కోచ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జట్టును గాడిలో పెట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయనప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల వ్యవహార శైలి ఏమాత్రం మెరుగు పడలేదు. గొడవలు, భిన్నాభిప్రాయాలు సర్వ సాధారణమయ్యాయి. దీంతో అతడు తన కోచ్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు.

కొత్త కోచ్ ఎవరంటే

కిర్ స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పకుండా నేపథ్యంలో వైట్ బాల్ ఫార్మాట్ బాధ్యతలను టెస్ట్ జట్టు కోచ్ గిలెస్పీ కి అప్పగించే యోచనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది. గ్యారీ కిర్ స్టెన్ దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన ఒకప్పటి ఆటగాడు. గిబ్స్, పొలాక్, ఎన్తిని వంటి సహచరులతో దక్షిణాఫ్రికా జట్టును తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు. 2011 లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కోచ్ గా కిర్ స్టెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్ జట్టుకు వైట్ బాల్ టీం కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఆ మరుసటి నెలలో అమెరికా – వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరిగింది. ఆ టోర్నీలో పాకిస్తాన్ జట్టు అమెరికాపై ఓటమిపాలైంది. అత్యంత అనామకంగా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో జట్టుబాగు కోసం కిర్ స్టెన్ ఎన్ని సూచనలు చేసినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టించుకోవడం మానేసింది. జట్టు ఆటగాళ్లు కూడా అదే ధోరణి కొనసాగించారు. దీంతో ఆ జట్టుతో వేగలేక కిర్ స్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే పాకిస్తాన్ వేదికగా మరో నాలుగు నెలల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో కోచ్ కిర్ స్టెన్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. “ఆ జట్టుతో నేను వేగలేను. నావల్ల కాదు. ఆటగాళ్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. జట్టు మేనేజ్మెంట్ కూడా అదేవిధంగా ధోరణి కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందువల్లే నా పదవికి రాజీనామా చేస్తున్నానని” కిర్ స్టెన్ తన అంతరంగీకులతో వాపోయాడని అంతర్జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొన్నది. ఛాంపియన్స్ ట్రోఫీ ఘనంగా నిర్వహించాలని భావించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు.. కోచ్ కిర్ స్టెన్ తీసుకున్న హఠాత్ నిర్ణయం ఒక్కసారిగా ప్రకంపనలకు కారణమవుతోంది.