T20 World Cup 2024: ఇదెక్కడి సీడింగ్ రా నాయనా.. రోహిత్ సేనకు ఆటంకంగా ఐసీసీ రూల్

గ్రూప్ - బీ లో ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్ - 8 కు దర్జాగా వెళ్ళిపోయింది. మిగిలిన స్థానం కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 8:23 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశ దాదాపుగా ముగింపునకు వచ్చింది. గ్రూప్ – ఏ లో భారత జట్టు అగ్ర స్థానంలో కొనసాగుతోంది. మిగతా స్థానం కోసం అమెరికా, పాక్ పోటీ పడుతున్నాయి. తదుపరి మ్యాచ్ లు ఫ్లోరిడా లో జరుగుతాయి కాబట్టి, పైగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి.. పాక్ కంటే అమెరికా కే సూపర్ – 8 కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి..

గ్రూప్ – బీ లో ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్ – 8 కు దర్జాగా వెళ్ళిపోయింది. మిగిలిన స్థానం కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి. ఒమన్ పై సాధించిన విజయంతో ఇంగ్లాండ్ రేసులోకి వచ్చింది. సూపర్ -8 వెళ్లేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నది. ఒక అంచనా ప్రకారం స్కాట్లాండ్ కంటే ఇంగ్లాండ్ కే సూపర్ -8 వెళ్లేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్ – సీ లో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్ -8 కు వెళ్లిపోయాయి.. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పపువా న్యూ గినియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకపక్ష విజయాన్ని సాధించింది. దీంతో టి20 క్రికెట్లో తొలిసారిగా ఆఫ్గనిస్తాన్ సూపర్ -8 లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో వైపు వెస్టిండీస్ కూడా సూపర్ -8 లోకి ప్రవేశించింది. గ్రూప్ – డీ లో దక్షిణాఫ్రికా సూపర్ -8 కు వెళ్లిపోయింది. ఈ గ్రూపులో బంగ్లాదేశ్ జట్టుకు తదుపరి దశకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ ప్రకారం సూపర్ -8 లో పోటీపడే ఈ 8 జట్లు దాదాపు ఖరారయినట్టే. ఈ ఎనిమిది జట్లను రెండు విభాగాలుగా ఐసీసీ విభజించనుంది. లీగ్ దశలో ఆయా గ్రూపులలో మొదటి స్థానంలో నిలిచిన జట్ల ర్యాంకుల ఆధారంగా ఐసీసీ వేరు చేయడం లేదు.. సీడింగ్ విధానం లో టి20 వరల్డ్ కప్ కంటే ముందే ఐసీసీ వేరు చేసింది. సూపర్ -8 లో ఎలాంటి జట్లు ఉంటే ఆట రక్తి కడుతుందో.. ముందుగానే ఐసీసీ నిర్ణయించింది. అందువల్ల భారత జట్టు బలమైన ప్రత్యర్థులతో పోటీ పడాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం గ్రూప్ ఫలితాలతో సంబంధం లేకుండా ముందుగానే ప్రతిభావంతమైన జట్లతో ఐసీసీ సూపర్ -8 ను రెండు గ్రూపులుగా విభజించింది. తదుపరి దశ కూడా మరింత ఆసక్తికరంగా జరిగేందుకు పలు జట్లను ముందుగానే అంచనా వేసింది. షెడ్యూల్ కూడా నిర్ణయించింది. గ్రూప్ వన్ లో భారత్ (A1), ఆస్ట్రేలియా (B2), న్యూజిలాండ్ (C1), శ్రీలంక(ఈ జట్లు లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళాయి) (D2)ను నిర్ణయించింది. గ్రూప్ -2 లో పాక్/ అమెరికా (A2), ఇంగ్లాండ్ (B1), వెస్టిండీస్ (C2), సౌత్ ఆఫ్రికా (D1) ను ఎంపిక చేసింది.

ఐసీసీ తలచింది ఒకటైతే.. లీగ్ దశలో మరొకటి జరిగింది.. గ్రూప్ -1 లో C1 గా ఉంటుందని భావించిన న్యూజిలాండ్ జట్టు, D2 గా భావించిన శ్రీలంక జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయాయి. ఆ జట్ల స్థానంలో అర్హత సాధించిన ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ (అంచనా ఉంది) తో భారత్ సూపర్ -8 లో పోటీ పడాల్సి ఉంటుంది.. లీగ్ దశలో గ్రూప్ టేబుల్ ఫలితాల ఆధారంగా సూపర్ -8 టోర్నీ నిర్వహిస్తే ఆస్ట్రేలియాతో భారత్ ఢీ కొనాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ సీడింగ్ వల్ల ఆస్ట్రేలియా తో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది.. ఇక ఆఫ్గనిస్తాన్ సూపర్ -8 లో భారత జట్టుతో తలపడాల్సి ఉంది.

ఇదీ భారత్ షెడ్యూల్

భారత్ vs ఆఫ్గనిస్తాన్; జూన్ 20, బార్బడోస్, రాత్రి 8 గంటలకు.

భారత్ vs బంగ్లాదేశ్; జూన్ 22, అంటిగ్వా.. రాత్రి 8 గంటలకు

భారత్ vs ఆస్ట్రేలియా: జూన్ 24, లూసియా.. రాత్రి 8 గంటలకు.