USA Vs Ireland: టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కథ సమాప్తమైంది. లీగ్ దశలోనే ఆ జట్టు పోరాటం ముగిసింది. చివరి మ్యాచ్లో ఐర్లాండ్ పై గెలిచి.. కొంచెం అదృష్టాన్ని జత చేసుకొని సూపర్ -8 కు వెళ్లాలని పాకిస్తాన్ భావించింది. అయితే వరుణుడు ఆ జట్టు ఆశలను నీళ్ల పాలు చేశాడు. ఫ్లోరిడాలోని లాండర్ హిల్ స్టేడియంలో శుక్రవారం జరగాల్సిన అమెరికా vs ఐర్లాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. దీంతో తొలి రౌండులోనే పాకిస్తాన్ ఇంటి ముఖం పట్టింది. మరోవైపు గ్రూప్ – ఏ లో భారత్, అమెరికా తదుపరి దశకు అర్హత సాధించింది.
ఫ్లోరిడాలో కొద్దిరోజులుగా వాతావరణం పూర్తిగా మారింది. ప్రతిరోజు అక్కడ వర్షం కురుస్తోంది. వర్షాల తీవ్రత పెరగడంతో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అక్కడ మ్యాచ్ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే వరుణుడు కరుణ చూపుతాడేమోనని అనుకుంటే.. పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. వర్షం వల్ల అమెరికా – ఐర్లాండ్ మ్యాచ్ కనీసం టాస్ వేయకుండానే రద్దయింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కావాల్సి ఉండగా.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. ముందుగా టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత ఎంతసేపటికీ మైదానం అనుకూలంగా లేకపోవడంతో, మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
వర్షం తగ్గిపోయినప్పటికీ మ్యాచ్ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేయాలని సిబ్బంది భావించారు. కానీ మరోసారి వర్షం కురవడంతో మ్యాచ్ జరిగేందుకు అవకాశం లేకుండా పోయింది.. చివరికి రాత్రి 11 గంటలకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ఎంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో అమెరికా, ఐర్లాండ్ జట్లకు చెరొక పాయింట్ లభించింది. దీనివల్ల అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి.. గ్రూప్ – ఏ లో భారత్ (6 పాయింట్లు) తర్వాత, అమెరికా ఐదు పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడింది. అమెరికా, భారత్ పై ఓడిపోయింది. కెనడాపై గెలిచింది. రెండు ఓటములతో సూపర్ -8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ దశలో అమెరికాపై ఐర్లాండ్ గెలిస్తే.. ఆ తర్వాత ఐర్లాండ్ ను ఓడించి సూపర్ -8 కు వెళ్లాలని పాకిస్తాన్ భావించింది.. కానీ ఆ జట్టు ఆశలను వరుణుడు దెబ్బ కొట్టాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు నిరాశలో కూరుకు పోయారు.