Hardik Pandya : గొప్ప ఆటగాడిగా పేరుపొందిన హార్దిక్ పాండ్యా కొంతకాలంగా మెరుగైన ఆట తీరు ప్రదర్శించడం లేదు. అప్పుడప్పుడు మెరుపులు తప్పితే.. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. పైగా వరుసగా గాయాలు.. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. గత వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన అతడు.. చాలా రోజులపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ గా అతడు కనిపించాడు. అయినప్పటికీ అతడిలో మునుపటి ఆట కనిపించలేదు. ఇక టి20 వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపించినప్పటికీ.. వాటిని పూర్తి కాలం ప్రదర్శించలేకపోయాడు. వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల అతడు కొన్ని టోర్నీల నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా హార్దిక్ పాండ్యా కొన్ని కీలక స్థానాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
హార్దిక్ పాండ్యా ఔట్
టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి.. అయితే సూర్యకుమార్ యాదవ్ తెరపైకి రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. కనీసం వైస్ కెప్టెన్ గా కూడా హార్దిక్ పాండ్యా పేరును టీమిండియా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తున్నారు. మొదట్లో టీమ్ మీడియా సెలెక్టర్లపై విమర్శలు వినిపించినప్పటికీ.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గాయాల పాలవుతున్న తీరు.. నిలకడ లేమి వల్లే అతడిని కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ గా నియమించడానికి టీమిండియా సెలెక్టర్లు సుముఖత వ్యక్తం చేయడం తెలుస్తోంది. భవిష్యత్ కాలంలోనూ అతడికి అవకాశాలు లభించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇక వన్డే జట్టులోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో గిల్ ను వైస్ కెప్టెన్ గా టీమిండియా సెలెక్టర్లు ప్రమోట్ చేస్తున్నారు. త్వరలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కి వైస్ కెప్టెన్ గా గిల్ వ్యవహరిస్తాడని టీమిండియా మేనేజ్మెంట్ ప్రకటించింది.. దీంతో హార్దిక్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.. ఇలా జరుగుతోందేంటని ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ” హార్దిక్ ప్రతిభావంతమైన ఆటగాడు. అంతటి ముంబై జట్టు యాజమాన్యం కూడా అతనిపై నమ్మకం ఉంచి కెప్టెన్ గా నియమించింది. అతడు అక్కడ కూడా తన నాయకత్వ పటిమను నిరూపించుకోలేదు. చివరికి జట్టులోను స్థిరంగా ఆడా లేకపోతున్నాడు. అందువల్లే అతడికి అవకాశాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. భావి కెప్టెన్ కావాల్సినవాడు.. ఇలా అనామక ఆటగాడిగా మిగిలిపోతున్నాడు. తన ఆట తీరు మెరుగుపరుచుకుంటే కొంతలో కొంత అవకాశాలు లభిస్తాయేమో చూడాలని” హార్దిక్ అభిమానులు పేర్కొంటున్నారు