Vijay Hazare Trophy Final: కర్ణాటక జట్టు ఇప్పటివరకు నాలుగు సార్లు విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకుంది. ఐదోసారి కూడా గెలుపొందాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే విదర్భ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో కర్ణాటక జట్టు దుమ్మురేపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆర్ వికెట్లు కోల్పోయి 348 రన్స్ చేసింది. విదర్భ ఎదుట 349 రన్స్ టార్గెట్ విధించింది. కర్ణాటక ఆటగాడు అభినవ్ మనోహర్ (Abhinav Manohar) 42 బంతులు మాత్రమే ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.. అతని విధ్వంసకరమైన బ్యాటింగ్ తో కర్ణాటక జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అభినవ్ మనోహర్ తో పాటు రవిచంద్రన్ సమరణ్(Ravichandran samaran) 92 బంతుల్లో మూడు 7 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మరో ఆటగాడు కృష్ణన్ శ్రీజిత్ 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ చేశాడు.. విదర్భ బౌలర్లలో దర్శన్ 67 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. నచికేత్ భుటే 70 పరుగులకు రెండు వికెట్లు నెలకూల్చాడు. యశ్ ఠాకూర్, యశ్ కడమ్ చెరి ఒక వికెట్ పడగొట్టారు.. అయితే అభినవ్ మనోహర్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం కర్ణాటక జట్టు భారీ స్కోరు చేయడానికి ఉపకరించింది.
హైదరాబాద్ 3.20 కోట్లకు కొనుగోలు చేసింది
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అభినవ్ మనోహర్ ను హైదరాబాద్ జట్టు 3.2 0 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కనిస ధర 30 లక్షలు. అతడు అద్భుతంగా ఆడటం.. బ్యాటింగ్ స్టైల్ కూడా విభిన్నంగా ఉండడంతో హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ అతడిని అంతేసి ధరకు కొనుగోలు చేసింది. వాస్తవానికి అతనికి 3.2 0 కోట్లు పెడుతున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అంత ధర ఎందుకు అని నొసలు చిట్లించారు. అయినప్పటికీ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. ధైర్యంగా ఆమె ముందుకు వచ్చింది. వెంటనే 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే విదర్భతో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అభినవ్ మనోహర్ ఊచ కోత కోయడంతో.. కావ్య మారన్ నిర్ణయం సరైనదేనని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అభినవ్ ఈ స్థాయిలో ఆడుతున్న నేపథ్యంలో వచ్చే ఐపిఎల్ లో అదరగొట్టడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అతడి దూకుడైన ఆట నచ్చింది కాబట్టే కావ్య మారన్ ఆ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టారని.. కచ్చితంగా అతడు ఆమె అంచనాలను అందుకుంటాడని జోస్యం చెబుతున్నారు.