Hari Hara Veeramallu Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో 2021 వ సంవత్సరంలో మొదలైన ఈ సినిమా అనేక ఒడిదుడుగులను ఎదురుకొని ఎట్టకేలకు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మార్చి 28 న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, అది సాధ్యమయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘మాట వినాలి’ విడుదలైంది. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ, విడుదల తర్వాత మాత్రం భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కేవలం 24 గంటల్లోనే ఈ పాటకు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో విడుదలైన మొట్టమొదటి లిరికల్ వీడియో సాంగ్స్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న పాటగా ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. మొదటి రోజు తర్వాత రెండవ రోజు వ్యూస్ బాగా పడిపోతాయేమో అని అనుకున్నారు. కానీ రెండవ రోజు కూడా ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెండవ రోజున ఈ పాటకు 60 లక్షల వ్యూస్ వచ్చాయట. ఇది టాలీవుడ్ లో మరో రికార్డు అని అంటున్నారు అభిమానులు. కేవలం రెండు నిమిషాల పాటకు ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు అసలు ఊహించలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పాటకు హిందీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో హిందీ వెర్షన్ కి 11 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
మొత్తం మీద అన్ని భాషలకు కలిపి ఈ పాటకు 36 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయని, ఫుల్ రన్ లో 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ సినిమాకి పెద్ద బూస్ట్ దొరికినట్టే. ఈ చిత్రం కేవలం 2D వెర్షన్ లో మాత్రమే కాదు, 3D వెర్షన్, ఐమాక్స్, డాల్బీ విజన్, ఐస్,4DX ఇలా ప్రపంచం లో ఎన్ని ఫార్మట్స్ అయితే ఉంటాయో, అన్ని ఫార్మట్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా VFX పనులను కూడా వివిధ దేశాల్లో చేయిస్తున్నారు. ప్రతీ షాట్ రిచ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ క్వాలిటీ మేకింగ్ తో పూర్తి అవ్వాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీన నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.