Yuvraj Singh : ఈ తరానికి యువరాజ్ అంటే తెలుసు. అంతకుముందు తరానికి కూడా కొద్దో గొప్పో తెలుసు. కానీ వచ్చే 20, 30 సంవత్సరాల తర్వాత కొత్త తరం యువరాజ్ గురించి తెలుసుకుంటే మాత్రం గూస్ బంప్స్ కచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అతడు ఆడిన ఆట అప్పుడు వారికి కొత్తగా కనిపిస్తుంది. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తీరు జ్ఞాపకం వస్తుంది. మైదానంలో చెమట.. చిందించిన రక్తం.. సరికొత్త అనుభూతినిస్తుంది. అతడు మనిషేనా? సూపర్ మేనా? అనే తీరుగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అనే కారణజన్మ క్రికెటర్ సృష్టించిన సంచలనం అటువంటిది. వాస్తవానికి కొత్తగా క్రికెట్ ఆడే ఆటగాళ్లు సచిన్ గురించి తెలుసుకుంటే చాలు.. కానీ భయానికి కూడా భయం కలిగించే విధంగా ఆడాలంటే మాత్రం కచ్చితంగా యువరాజు గురించి తెలుసుకోవాలి. అతడి కథ కూడా వినాలి.
పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు
1981 డిసెంబర్ 12న పంజాబ్లోని చండీగఢ్ ప్రాంతంలో యువరాజ్ సింగ్ పుట్టాడు.. అతని తండ్రి యోగ్ రాజ్ పెట్టినట్టుగానే టీం ఇండియాకు అతడు యువరాజు అయ్యాడు.. చిన్నతనంలో అతడు స్కేటింగ్ విపరీతంగా ఆడేవాడు. ఆ తర్వాత తన ఇష్టాన్ని క్రికెట్ వైపు మలుచుకున్నాడు.. అలా పాఠశాల స్థాయి, అండర్ -16 స్థాయిలో అద్భుతాలు సృష్టించాడు. 2000 సంవత్సరంలో మొహమ్మద్ కైఫ్ నాయకత్వంలో అండర్ 19 జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఆయడాది టీమిండియా యువ జట్టు వరల్డ్ కప్ దక్కించుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అదే ఏడాది జాతీయ జట్టులకు ప్రవేశించాడు.. 2000 అక్టోబర్ 3 న కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్ లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశాలు లభించలేదు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు. అయితే ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. తొలి మ్యాచ్లో యువరాజ్ సింగ్ పాయింట్ లో గాల్లోకి ఎగురుతూ అందుకున్న క్యాచ్.. సీనియర్ క్రికెటర్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అదే టోర్నీలో ఆస్ట్రేలియాతో తదుపరి మ్యాచ్ టీమ్ ఇండియా ఆడింది. ఈసారి యువరాజ్ సింగ్ కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. 12వ నెంబర్ జెర్సీ ధరించి 80 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 బౌండరీలు ఉన్నాయి. తన బ్యాటింగ్ ద్వారా కపిల్ దేవ్ ను నాటి కెప్టెన్ గంగూలీకి గుర్తు చేశాడు. గంగూలీ ప్రోత్సాహం ఇవ్వడంతో యువరాజ్ రాటుదేరాడు. మహమ్మద్ కైఫ్ తో ఫీల్డింగ్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. 2002 లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ గంగూలి చొక్కా విప్పి ఎగిరాడు. గంగూలీ కి అలాంటి అవకాశం ఇచ్చింది యువరాజ్ – కైఫ్ జోడి. ఆ మ్యాచ్లో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్ ఇండియాను విజేతగా నిలిపింది యువరాజ్ – కైఫ్.
టి20 వరల్డ్ కప్ లో..
2007 వరల్డ్ కప్ లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలోని టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. కెప్టెన్ పోస్ట్ నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు. అదే సంవత్సరం టీమిండియా టి20 వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. సీనియర్ ఆటగాళ్లు సచిన్, ద్రావిడ్, గంగూలీ ఆ టోర్నీకి దూరంగా ఉన్నారు. అయితే యువ జట్టుకు యువరాజ్ ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావించింది. అయితే సచిన్ సూచనల మేరకు ఆ స్థానం ధోనికి దక్కింది. సచిన్ లాంటివాడు అలాంటి సూచన చేయడంతో యువరాజ్ సైలెంట్ అయిపోయాడు. తనకు కెప్టెన్సీ ఇవ్వకపోయినప్పటికీ యువరాజ్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఏకంగా ఇంగ్లాండ్ జట్టు పై ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతో యువరాజ్ రెచ్చిపోయాడు. పనిష్మెంట్ బ్రాడ్ కు ఇచ్చాడు. యువరాజ్ ఆ మ్యాచ్ మాత్రమే కాకుండా ఆ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడాడు. ఫలితంగా టీమ్ ఇండియా విజేతగా నిలిచింది.
నెత్తురు కక్కుకుంటూ..
2011 వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ సింహనాదం చేశాడు. ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో రక్తం కక్కుకుంటూనే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. టీమిండియాను గెలిపించాడు. సచిన్ కు వరల్డ్ కప్ ను బహుమతిగా ఇచ్చాడు. అలా నోట్లో రక్తంతో యువరాజ్ వాంఖడే మైదానంలో మహా రుద్రుడిగా దర్శనమిచ్చాడు. అయితే ఆ ఘటన తర్వాత యువరాజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని ప్రపంచానికి తెలిసింది. అంతటి కష్టంలోనూ అతడు దేశం కోసం ఆడాడు. తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ” దేశం కోసం సైనికులు ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్నారు. అలాంటిది ఒక జట్టు కోసం నేను ప్రాణం పెట్టి ఆడకపోతే ఎలా ఉంటుంది.. నోట్లో నుంచి రక్తం వస్తోంది. అయినప్పటికీ నేను ఆట మీదనే దృష్టి సారించాను. ఆట మరింత గట్టిగా ఆడాలనుకున్నాను. అదే చేశానని” ఒక ప్రైవేట్ ప్రోగ్రాం లో యువరాజ్ వ్యాఖ్యానించాడు.
ఏదీ దక్కకపోయినప్పటికీ..
అలాంటి ఆటగాడికి కెప్టెన్సీ దక్కలేదు. లెజెండరీ ఆటగాడు అయినప్పటికీ అతడి జెర్సీ నెంబర్ ను బీసీసీఐ రిటైర్ చేయలేదు. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న సమయంలో సరైన ఫేర్వెల్ కూడా అతనికి దక్కలేదు. ఇలాంటి ఎన్నో అపరాధ భావాలు ఉన్నప్పటికీ.. యువరాజ్ ఇప్పటికీ క్రికెట్ కోసమే తపిస్తున్నాడు. వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. అతడి చేతుల్లో శిక్షణ పొందిన వారిలో గిల్, అభిషేక్ శర్మ ఉన్నారు. వాళ్లు ఎలా ఆడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత చదివిన తర్వాత.. ఇదంతా తెలుసుకున్న తర్వాత వచ్చే తరం యువరాజ్ ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే అతడు దూకుడైన క్రికెట్ కు దారి చూపిన ఆటగాడు. అద్భుతమైన ఫీల్డింగ్ తో సత్తా చాటిన ఆటగాడు. మెలికలు తిప్పే బంతులు వేసి జెంటిల్మెన్ గేమ్ కు అందాన్ని తీసుకొచ్చిన ఆటగాడు. అన్నింటికీ మించి ఆ కాలంలో అందమైన అమ్మాయిల కలల రాకుమారుడు!
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Team india farmer allrounder yuvraj singh biography life story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com