Suryakumar Yadav: అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో సూర్య కుమార్ యాదవ్ దానిని రిపీట్ చేశాడు. తద్వారా టీమ్ ఇండియాకు తిరుగులేని స్థాయిని కల్పించాడు. ఇది ఒకరకంగా అద్భుతం.. అనన్య సామాన్యం. వాస్తవానికి ఈ ఘనత ఏ ఆటగాడు అయినా సాధిస్తే.. కచ్చితంగా ఆ జట్టు యాజమాన్యం అతడిని నెత్తి మీద పెట్టుకునేది. కానీ అక్కడ ఉన్నది గౌతమ్ గంభీర్.. సూర్య కుమార్ యాదవ్ నాయకుడిగా గొప్పగానే వ్యవహరిస్తున్నాడని
.. ఆటగాడిగా విఫలమవుతున్నాడని తెరపైకి సరికొత్త వివాదాన్ని తీసుకొచ్చాడు. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. తాను అనుకున్నట్టుగా సూర్య కుమార్ యాదవ్ ను ఆటగాడిగా.. నాయకుడిగా.. ఇలా రెండు స్థానాల నుంచి విజయవంతంగా బయటికి పంపించాడు.
ఇక అప్పటినుంచి సూర్య కుమార్ యాదవ్ పడుతున్న ఇబ్బంది మామూలుది కాదు. పోనీ సూర్య కుమార్ యాదవ్ ను బయటికి పంపించిన తర్వాత టీమ్ ఇండియా ఏమైనా బాగుపడిందా అంటే.. వరుసగా 6 మ్యాచ్లలో ఓడిపోయింది. నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. రెండు సిరీస్లను వైట్ వాష్ చేసుకుంది. ఇందులో ఐర్లాండ్ చేతిలో ఓడిన తీరు టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహార శైలికి ఒక చెప్పు దెబ్బ లాంటి ఫలితం. ఇన్ని రకాలుగా టీమిండియా వ్యతిరేక ఫలితాలను చూస్తున్నప్పటికీ గంభీర్ మారలేదు. సూర్య కుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలి అనుకోలేదు.
మేనేజ్మెంట్ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి.. సూర్య కుమార్ యాదవ్ కూడా మారు మాట మాట్లాడలేదు. జట్టులో స్థానం లేకపోయినప్పటికీ వెనకడుగు వేయలేదు. తన లోపాలను సవరించుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిరోజులుగా అతడు తీవ్రంగా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.. ప్రతిరోజు మూడు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు 1000 బంతులను ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేశాడు.. అతడు పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టి20 వరల్డ్ కప్ విన్నర్ కు ఇటువంటి కష్టం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.. సూర్య కుమార్ కు జట్టులో చోటు కల్పించాలని.. అతడికి మళ్ళీ కెప్టెన్సీ అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి గౌతమ్ గంభీర్ వారి డిమాండ్లకు తలవంచుతాడా.. వారు కోరుకున్నట్టుగా చేస్తాడా..
అన్నట్టు ఇటీవల జింబాబ్వే సిరీస్ కు గౌతమ్ గంభీర్ దూరంగా ఉన్నాడు. లక్ష్మణ్ శిక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. టీమిండియాను గెలిపించాడు. ఆరు ఓటముల తర్వాత.. వరుసగా మూడు విజయాలు అందించాడు. రెండు సిరీస్ లు కోల్పోయిన తర్వాత.. ఏకపక్ష సిరీస్ ను అందించాడు. కోల్పోయిన నెంబర్ వన్ స్థానాన్ని కూడా తిరిగి ఇచ్చాడు. ఈ లెక్కన గంభీర్ పరిస్థితి కూడా డోలాయమానంలోనే ఉంది.





