https://oktelugu.com/

India Vs Sri Lanka 2nd Odi: మళ్లీ పాత కథే.. గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక చేతిలో టీమిండియా దారుణ ఓటమి..

241 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేసి సత్తా చాటాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 5, 2024 / 08:15 AM IST

    India Vs Sri Lanka 2nd odi(1)

    Follow us on

    India Vs Sri Lanka 2nd Odi: గెలవాల్సిన తొలి వన్డే మ్యాచ్ అర్ష్ దీప్ సింగ్ వల్ల టై అయింది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా అంచనాలు వేసుకుంది. అందుకు తగ్గట్టుగానే పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగింది. కానీ ఫలితమే మరో తీరుగా వచ్చింది. కొలంబోలోని ప్రేమదాస మైదానంలోనే ఆదివారం రెండవ వన్డే జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 240 రన్స్ చేసింది. అయితే భారత బౌలర్లు 24 పరుగులను ఎక్స్ ట్రా ల రూపంలో సమర్పించుకోవడం విశేషం. శ్రీలంక ఇండియన్స్ లో ఆవిష్క ఫెర్నాండో 40, కమిందు మెండీస్ 40, వెల్ల లాగే 39, కుశాల్ మెండిస్ 30, అసలంక 25 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది.. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, కులదీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. శ్రీలంక విధించిన 241 రన్ టార్గెట్ ను చేజ్ చేయడంలో టీమిండియా తడబడింది. ఫలితంగా రోహిత్ అనుకున్న రిజల్ట్ రాలేదు. 32 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవి చూడాల్సి వచ్చింది..

    241 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేసి సత్తా చాటాడు. సెంచరీ వైపు వెళ్తున్న అతడు వాండర్సే బౌలింగ్లో నిస్సాంక కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.. తొలి వికెట్ కు రోహిత్ గిల్ (35)తో కలిసి 97 పరుగులు జోడించాడు. ఆ తర్వాత గిల్ జట్టు స్కోరు 116 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గిల్ కూడా వాండర్సే బౌలింగ్ లో కమిందు మెండిస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన శివం దూబే(0) వాండర్సే బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.. విరాట్ కోహ్లీ 14 పరుగులు చేసి వాండర్సే బౌలింగ్ లోనే ఎల్బిడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్(44) సత్తా చాటినప్పటికీ శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0), వాషింగ్టన్ సుందర్ (15) వెంట వెంటనే ఔట్ కావడంతో భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. కీలకమైన ఆటగాళ్లు పెవిలియన్ చేరుకోవడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. ఇదే దశలో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు..వాండర్స్ తొలి దశలో ఆరుగురు కీలక ఆటగాళ్లను ఔట్ చేసి సత్తా చాటితే.. ఆ తర్వాత పనిని అసలంక పూర్తి చేశాడు..

    వాస్తవానికి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు చూస్తే ఏ దశలోనూ ఈ మ్యాచ్ ఓడిపోకూడదు. నిర్జీవమైన మైదానంపై రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. టి20 తరహాలో ఆడాడు. అతడు ఆడిన తీరు చూసి చాలామంది 30 ఓవర్ల లోపే మ్యాచ్ ముగుస్తుందనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాండర్స్ బంతి చేతిలో పట్టుకున్నాడో.. అప్పుడే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న శివం దుబే, కేఎల్ రాహుల్ , శ్రేయస్ అయ్యర్ విఫలం కావడం జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. టీమిండియా మూడో వికెట్ కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా తడబాటుకు గురైంది. అక్షర్ పటేల్ మెరుగ్గానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. అతడు కూడా అసలంక బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ కావడంతో ఒక్కసారిగా శ్రీలంక మ్యాచ్ పై మరింత పట్టు బిగించింది. తొలి వన్డే అర్ష్ దీప్ సింగ్ వల్ల టై అవ్వగా.. రెండవ వన్డేలో మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ వాండర్సే ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం.