SRH Vs KKR 2024: లెక్క తప్పలేదు.. కోల్ కతా విజయ విహారం ఆగలేదు.. దర్జాగా ఫైనల్ కు..

టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలో హైదరాబాద్ 159 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రాహుల్ త్రిపాఠి 55, క్లాసెన్ 32, కమిన్స్ 30 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 8:17 am

SRH Vs KKR 2024

Follow us on

SRH Vs KKR 2024: ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ దశలో అద్భుతంగా ఆడి.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్ వెళ్లిన కోల్ కతా జట్టు.. ప్లే ఆఫ్ లోనూ అదే సత్తా చాటింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయాన్ని అందుకుని.. దర్జాగా ఫైనల్ వెళ్ళింది. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను చిత్తు చేసింది.

టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలో హైదరాబాద్ 159 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రాహుల్ త్రిపాఠి 55, క్లాసెన్ 32, కమిన్స్ 30 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.. మిగతా వారంతా ఏదో అర్జెంటు పని ఉందన్నట్టుగా అలా వచ్చి ఇలా పెవిలియన్ వెళ్ళిపోయారు. కోల్ కతా బౌలర్లలో స్టార్క్ బుల్లెట్ లాంటి బంతులు వేశాడు. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ న రైన్, రసెల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు ఏ దశలోనూ ఓడిపోతున్నట్టు కనిపించలేదు. 13.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 164 రన్స్ చేసింది. సునాయాస విజయాన్ని అందుకుంది. వెంకటేష్ అయ్యర్ 51*, శ్రేయస్ అయ్యర్ 58* అర్థ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో కోల్ కతా సులువైన విజయం సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.

కోల్ కతా కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మూడు ఓవర్లలోనే 40 పరుగులు పిండుకున్నారు. రెహమానుల్లా గుర్బాజ్ ను నటరాజన్ అవుట్ చేయగా.. సునీల్ నరైన్ ను కమిన్స్ వెనక్కి పంపించాడు. అయితే వీరిద్దరి క్యాచ్ లను విజయ్ కాంత్ వియాస్కాంత్ అనుకున్నాడు.. ఈ దశలో వచ్చిన వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ హైదరాబాద్ బౌలర్లను దాటిగా ఎదుర్కొన్నారు. కోల్ కతా జట్టు కు విజయాన్ని నల్లేరు మీద నడకను చేశారు. పది పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ ను కీపర్ క్లాసెన్ నేలపాలు చేశాడు.. సహచర ఫీల్డ్ రాహుల్ త్రిపాఠి అతడిని గుద్దుకోవడంతో క్లాసెన్ పట్టిన క్యాచ్ ను జాలవిడిచాడు. ఆ తర్వాతి ఓవర్ ను నటరాజన్ వెయ్యగా.. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ను హెడ్ పట్టుకోలేకపోయాడు. రెండు జీవధానాలు లభించడంతో శ్రేయస్ అయ్యర్ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. భారీ సిక్స్ లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఆ క్యాచ్ లు కనుక పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ఈ ఓటమితో హైదరాబాద్ ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.