SRH Vs KKR 2024: నిర్లక్ష్యం, స్వయంకృతాపరాధం.. హైదరాబాదు ఓటమికి కారణాలెన్నో?

ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ నిర్లక్ష్యం కూడా హైదరాబాద్ కొంపముంచింది. దూకుడుగా ఆడతాడని పేరున్న హెడ్ సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా నిర్లక్ష్యం షాట్ కు మూల్యం చెల్లించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 8:05 am

SRH Vs KKR 2024

Follow us on

SRH Vs KKR 2024: కీలకమైన ప్లే ఆఫ్ ముందు లీగ్ దశలో లక్నో జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించింది. మరో మ్యాచ్లో పంజాబ్ విధించిన 200+ స్కోర్ ను మంచినీళ్లు తాగినంత ఈజీగా చేదించింది. కానీ ఇదే సత్తాను, ఇదే దమ్మును, ఇదే స్థైర్యాన్ని ప్లే ఆఫ్ మ్యాచ్ లో చూపించలేకపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్.. ఇలా అన్ని అంశాల్లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ఫలితంగా కోల్ కతా జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. హోరాహోరీగా సాగుతుందనుకున్న క్వాలిఫైయర్ -1 మ్యాచ్ ను ఏకపక్ష పోరాటంగా మార్చింది.

బ్యాటింగ్ నిర్ణయం తప్పు

అహ్మదాబాద్ మైదానం పై హైదరాబాద్ కెప్టెన్ కు సరైన అవగాహన లేదని టాస్ నిర్ణయం ద్వారా తేలిపోయింది.. ఎరుపు, నలుపు మట్టితో ఈ మైదానాన్ని రూపొందించారు. ఫలితంగా ప్రారంభంలో వికెట్ కు సహకరించింది.. ఆ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది. డ్యూ రావడం వల్ల బౌలింగ్ చేయడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి మైదానంపై టాస్ గెలిచిన కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ వైపు మొగ్గుచూపడం హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసింది.

ఓపెనర్ల నిర్లక్ష్యం

ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ నిర్లక్ష్యం కూడా హైదరాబాద్ కొంపముంచింది. దూకుడుగా ఆడతాడని పేరున్న హెడ్ సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా నిర్లక్ష్యం షాట్ కు మూల్యం చెల్లించుకున్నాడు. వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు త్వరగా వికెట్లను కోల్పోయింది.. వాస్తవానికి హైదరాబాద్ సాధించిన విజయాలలో వీరిద్దరిదే కీలకపాత్ర. కానీ కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో వీరిద్దరూ దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. ఇద్దరిలో ఒక్కరైనా నిలబడితే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది.

ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు

టి20 మ్యాచ్ అంటేనే దూకుడుకు పర్యాయపదం. ఈ సమయంలో ఆటగాళ్లు కుదురుకుంటేనే భారీగా పరుగులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలో నిలబడే దానికంటే.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోవాలని దానికే ప్రాధాన్యమిచ్చారు. నితీష్ కుమార్ రెడ్డి నిరాశపరచగా… షాబాజ్ అహ్మద్ స్వల్ప స్కోర్ కే అవుట్ అయ్యాడు. అహ్మద్ ను లోయర్ ఆర్డర్ లో పంపించడం జట్టుకు తీవ్రమైన నష్టం చేకూర్చింది.. మరోవైపు రాహుల్ త్రిపాఠి రన్ అవుట్ కావడం తో ఒక్కసారిగా హైదరాబాద్ స్కోర్ ప్రభావితమైంది.. లేని పరుగుకు పరిగెత్తి అతడు హైదరాబాద్ జట్టు కొంప ముంచాడు. సన్వీర్ సింగ్ కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. సన్విర్ సింగ్ ఒకవేళ ఇంపాక్ట్ చూపించింటే హైదరాబాద్ స్కోర్ మరో విధంగా ఉండేది.

స్పిన్నర్ లేకపోవడం

అహ్మదాబాద్ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అయితే హైదరాబాద్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తీసుకోలేదు. వాషింగ్టన్ సుందర్, మయాంక్ మర్కండే, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సన్ వంటి వారు ఉన్నప్పటికీ.. వారిని పక్కన పెట్టి విజయ్ కాంత్ వియస్కాంత్ ను తీసుకోవడం హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసింది..