Rahul Tripathi: శభాష్ రాహుల్ త్రిపాఠి.. నువ్వు ఏడ్చావ్.. ప్రేక్షకులనూ ఏడిపించావ్..

మంగళవారం రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 8:32 am

Rahul Tripathi

Follow us on

Rahul Tripathi: ఓవైపు స్టార్క్ వరుసగా వికెట్లు తీస్తున్నాడు. మైదానంలో నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తున్నాడు.. మరోవైపు ఓవర్లు కరిగిపోతున్నాయి.. ఆశించినంత స్థాయి స్కోర్ రావడం లేదు. ఈ దశలో అతడు బ్యాటింగ్ కు వచ్చాడు. క్లాసెన్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం భుజాలకు ఎత్తుకున్నాడు. 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు.. ఇన్నింగ్స్ పర్వాలేదనుకుంటున్న సమయంలో రన్ ఔట్ అయ్యాడు.. జట్టు స్కోర్ పెరుగుతుందనే సమయంలో అవుట్ అయ్యాననే బాధతో అతడు గుండెలు పగిలే విధంగా రోదించాడు. డ్రెస్సింగ్ రూమ్ వెళ్లకుండానే మెట్లమీద కూర్చుని.. మైదానం లోపల జరుగుతున్న దృశ్యాలను చూసి లోలోపల బాధపడ్డాడు. తలకిందకి ఉంచి వెక్కివెక్కి ఏడ్చాడు.. ప్రేక్షకులను సైతం ఏడిపించాడు.. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. అతడి ఆటకు అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు.

మంగళవారం రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీలో హైదరాబాద్ తరఫున దాటిగా ఆడుతున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. స్టార్క్ బౌలింగ్లో హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగులు ఏమీ చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. ఇలా 0 పరుగులకు హెడ్ అవుట్ కావడం ఇది రెండవసారి.. ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ హెడ్ ఇలానే ఆటయ్యాడు.. అభిషేక్ శర్మ 3, నితీష్ కుమార్ రెడ్డి 9, షాబాద్ అహ్మద్ 0 వెంట వెంటనే అవుట్ కావడంతో.. క్లాసెన్ తో కలిసి జట్టు భారాన్ని రాహుల్ త్రిపాఠి భుజాలకెత్తుకున్నాడు.. ఐదో వికెట్ కు 32 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ దశలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లాసెన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అయినప్పటికీ రాహుల్ త్రిపాఠి ధైర్యంగానే ఉన్నాడు.. మరో ఆటగాడు అబ్దుల్ సమద్ తో కలిసి దాటి ఆడే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ దశలో అండ్రీ రస్సెల్ అద్భుతమైన త్రో తో రాహుల్ రన్ అవుట్ అయ్యాడు.. దీంతో రాహుల్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన ఇంపాక్ట్ ఆటగాడు సన్వీర్ సింగ్ (0) వెంటనే అవుట్ కావడంతో రాహుల్ త్రిపాఠి మరింత ఆవేదనకు గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తూ మెట్ల మీదే కూర్చుండిపోయాడు. తల కిందికి వంచి బ్యాట్ రెండు చేతుల్లో పట్టుకొని గుండెలు పగిలేలా రోదించాడు.

తన వల్లే జట్టుకు ఈ దుస్థితి దాపురించిందని బాధపడ్డాడు. మ్యాచ్ మొత్తం అయ్యేవరకు క్రీజ్ లో ఉండాల్సిందని ఆవేదన చెందాడు.. ఒకవైపు వికెట్లు మొత్తం పోతున్నప్పటికీ.. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ఒంటరి పోరాటం చేశాడు. 120 లోపు ప్యాక్ అవుతుందనుకున్న హైదరాబాద్ స్కోర్ ను 159 దాకా తీసుకెళ్లాడు. హైదరాబాద్ ఆటగాళ్లల్లో రాహుల్ త్రిపాఠి 55, క్లాసెన్ 32, కమిన్స్ 30 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు..కోల్ కతా బౌలర్లలో స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్ తలా ఒక క్రికెట్ పడగొట్టారు.. హెడ్, అభిషేక్ శర్మ దారుణంగా విఫలం కావడం హైదరాబాద్ జట్టును నిండా ముంచింది.