South Africa Vs England: ఆ క్యాచ్.. సౌత్ ఆఫ్రికాను విజేతను చేసింది.. ఇంగ్లాండ్ ను పడుకోబెట్టింది

సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా గెలిచాడు. డేవిడ్ మిల్లర్ 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 22, 2024 3:47 pm

South Africa Vs England

Follow us on

South Africa Vs England: టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు అదరగొడుతోంది. అద్భుతమైన విజయాలు సాధించి ఆకట్టుకుంటున్నది. శుక్రవారం సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లాండ్ జట్టుపై ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ -8 లో వరుసగా రెండు విజయాలు సాధించి, సెమీస్ అవకాశాలను పదిలంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా గెలిచాడు. డేవిడ్ మిల్లర్ 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు.

వాస్తవానికి ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు అదిరిపోయే ఆరంభం లభించింది. సులువుగా 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి, దక్షిణాఫ్రికా ఆటగాళ్లను పెవిలియన్ పంపించారు. ఓపెనర్ డికాక్ ఒక్కడే ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 9.4 ఓవర్లకు 86/0 మెరుగైనస్థితిలో ఉన్న సౌత్ ఆఫ్రికా.. ఆ తర్వాత తడబడింది. 15 ఓవర్లకు 115/4కు పడిపోయింది. ఈ దశలో మిల్లర్ దూకుడుగా ఆడాడు. దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

ఈ స్కోర్ తో ఇంగ్లాండ్ జట్టును సౌత్ ఆఫ్రికా నిలువరిస్తుందా? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తం అయింది. స్లో మైదానంపై దక్షిణాఫ్రికా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో, ఆరు వికెట్లు నష్టపోయి 156 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కేశవ్ మహారాజ్ 2/25, రబాడ 2/32 దూకుడుగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లివింగ్ స్టోన్ 33, బ్రూక్ 53 పరుగులు చేసి, ఇంగ్లాండ్ జట్టు వైపు మ్యాచ్ మళ్లించారు. రబాడ వేసిన 15 ఓవర్లో 18, బార్ట్ మన్ వేసిన 17 ఓవర్లో 21 పరుగులు సాధించడంతో.. ఇంగ్లాండ్ విజయ సమీకరణం 18 బంతుల్లో 25 పరుగులకు చేరుకుంది.

ఈ దశలో లివింగ్ స్టోన్ ను రబాడ పెవిలియన్ పంపించాడు. కేవలం ఆ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు గెలుపొందాలంటే చివరి ఓవర్ లో 14 పరుగులు కావలసి వచ్చింది. అప్పటికి స్ట్రైకింగ్ లో బ్రూక్ ఉండడంతో విజయం పై ఇంగ్లాండ్ జట్టుకు ఆశలు ఉన్నాయి. పైగా చివరి ఓవర్ నోకియా వేశాడు . తొలి బంతిని మిడ్ ఆఫ్ మీదుగా నోకియా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించి, బంతిని గట్టిగా కొట్టగా అది గాల్లోకి లేచింది. ఇదే దశలో కెప్టెన్ మార్క్రం వెనక్కి పరిగెత్తుకుంటూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా దక్షిణాఫ్రికా వైపు టర్న్ అయింది. సామ్ కరన్(10*) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మొత్తానికి ఈ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేసింది.