Shah Rukh Khan: ఐపీఎల్ టోర్నీ ముగిసింది..కోల్ కతా 17వ సీజన్ విజేతగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో సరికొత్త చర్చ నడుస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్(T20 World Cup) తర్వాత.. టీమ్ ఇండియాకు కొత్త కోచ్ వస్తాడు. ఇప్పటికే దీనికి సంబంధించి బిసిసిఐ(BCCI) ప్రకటన విడుదల చేసింది. “కొద్దిరోజులు లక్ష్మణ్ వస్తాడని, మరికొద్ది రోజులు రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కొనసాగుతాడని.. లేదు లేదు, విదేశీ కోచ్ ల వైపు బీసీసీ పెద్దలు చూస్తున్నారని..”ఇలా రకరకాలుగా ప్రచారాలు సాగాయి. చివరికి ఇవన్నీ కూడా గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిరూపించాయి. కోల్ కతా(KKR) ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత.. టీమిండియా కోచ్ రేసులో గౌతమ్ గంభీర్(Gautam Gambhir) పేరు వినిపిస్తోంది. ఎందుకంటే కోల్ కతా జట్టుకు మెంటార్ గా గౌతమ్ గంభీర్ వ్యవహరించాడు. గత రెండు సీజన్లో లక్నో జట్టుకు కూడా అతడు ఇదే పని చేశాడు. అప్పుడు లక్నో జట్టు ప్లే ఆఫ్ దాకా వచ్చింది. ఇప్పుడు గౌతమ్ ఆధ్వర్యంలో కోల్ కతా కప్ గెలిచిన నేపథ్యంలో.. అతడు టీమిండియా కోచ్ రేసులో ముందు వరుసలో ఉండడని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెక్రటరీ జై షా కలిసి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు గౌతమ్ గంభీర్ కూడా ఆసక్తిగా ఉన్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. గౌతమ్ గంభీర్ గత రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. అయితే అతడిని మళ్లీ కోల్ కతా జట్టుకు తీసుకొచ్చేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా శ్రమించాడు. అతడు కోల్ కతా జట్టు కు వచ్చేందుకు బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడని తెలుస్తోంది. అంతేకాదు జట్టుతో 10 ఏళ్ల పాటు ప్రయాణం కొనసాగించాలని కోరినట్టు తెలుస్తోంది. ” ఎటువంటి ఫలితం వచ్చినా ఇబ్బంది లేదు. జట్టును ఎలా ముందుకు నడిపిస్తావనేది నీ ఇష్టం. కానీ, ఎటువంటి అప్రతిష్ట రాకూడదు. చెడ్డ పేరు మోసేందుకు సిద్ధపడకూడదు” అని షారుక్ గంభీర్ తో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అదే కనుక నిజమైతే.. గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్ పదవికి కచ్చితంగా అడ్డంకిగా మారుతుంది.. అప్పుడు బీసీసీఐ పెద్దలు షారుక్ ఖాన్ తో చర్చించాల్సి ఉంటుంది. అతడు ఓకే చెబితే గౌతమ్ గంభీర్ ను టీం ఇండియా కోచ్ గా నియమించేందుకు బీసీసీఐ పెద్దలకు అవకాశం ఉంటుంది. అయితే గౌతమ్ గంభీర్ బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడా? క్రీడాకారులు అతని నియామకం పట్ల ఎలా స్పందిస్తారు? ముక్కోపి అయిన గౌతమ్ గంభీర్ టీమిండియా ను హ్యాండిల్ చేయగలడా ? అనే ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
IPL 2024 : కోల్ కతా విజేత కావొచ్చు.. అభిమానుల మనసు గెలవడంలో ఈమె తర్వాతే ఎవరైనా..
Gautam Gambhir: కోల్ కతా విజయానికి శ్రీకృష్ణుడే కారణం.. ఇదేం లాజిక్ గంభీర్ భాయ్..