https://oktelugu.com/

IPL 2024 : కోల్ కతా విజేత కావొచ్చు.. అభిమానుల మనసు గెలవడంలో ఈమె తర్వాతే ఎవరైనా.

ఈ లెక్కన అభిమానుల మనసు ఆ స్థాయిలో గెలుచుకుంది అంటే.. కావ్య వ్యూహ చతురత ఏమిటో.. ఆమె ఎలా ఆలోచిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2024 / 04:03 PM IST

    Kavya-Maran

    Follow us on

    IPL 2024 : 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోల్ కతా జట్టు ఐపిఎల్ విజేతగా ఆవిర్భవించింది. 17వ సీజన్లో హైదరాబాద్ జట్టును ఫైనల్ లో మట్టికరిపించి కప్ ను సగర్వంగా ఒడిసి పట్టింది. దీంతో అభిమానులు కోల్ కతా జట్టు ఆటగాళ్లపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతంగా ఆడారు అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి ఐపీఎల్ విజేత కోల్ కతా కాదని.. అసలు సిసలైన విన్నర్ ఆమె అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..

    హోరాహోరిగా సాగుతుందనుకున్న ఫైనల్ మ్యాచ్.. పూర్తి ఏకపక్షంగా మారింది. కోల్ కతా బౌలర్ల చేతిలో హైదరాబాద్ జట్టు దాసోహం అయింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు 113 పరుగులకే ప్యాకప్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని కోల్ కతా జట్టు ఆడుతూ పాడుతూ సాధించింది.. అయితే తన జట్టు కోలుకోలేని కష్టాల్లో ఉన్నప్పటికీ..సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తన క్రీడా స్ఫూర్తిని మర్చిపోలేదు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని తనకు తానే సర్ది చెప్పుకుంది. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభానికి ముందు ప్రతిక్షణం టీం విజయం కోసం కావ్య తపన పడింది. గత ఏడాది పదోవ స్థానంలో ఉన్న ఆమె జట్టు.. ఈసారి ఏకంగా ఫైనల్ చేరింది. అందుకు ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణం. అయితే ఫైనల్ మ్యాచ్లో కావ్య అంచనాలు తప్పాయి.. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. నిజానికి కావ్య చేతిలో లెక్కలేనంత డబ్బు ఉంది. అనితర సాధ్యమైన వ్యాపారాలు ఉన్నాయి. అందులో నష్టాలు రావచ్చు.. లాభాలు కళ్ల చూడవచ్చు. కానీ ఎన్నడూ కావ్య వాటి గురించి బయట చెప్పలేదు. బయటపడలేదు. కానీ ఐపీఎల్ లో తన జట్టు ఓడిపోవడాన్ని ఆమె జీర్ణించుకోవడం లేదు.

    తన జట్టు ఓడిపోయినప్పటికీ.. కావ్య స్టాండ్స్ లోకి వచ్చి కోల్ కతా ఆటగాళ్లను అభినందించింది. ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు ఆట తీరును తలచుకొని బాధపడింది. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూనే… తన జట్టు ఆటగాళ్లను కూడా అభినందించింది. ఎందుకంటే గత ఏడాది హైదరాబాదు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక గత ఏడాది జరిగిన ఆటగాళ్ల వేలంలో కమిన్స్ ను అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. కావ్య అలా చేయడం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది నేరుగా ఆమెను ఉద్దేశించి సెటైర్లు వేశారు. అయినప్పటికీ వాటన్నింటినీ ఆమె భరించింది.. తను కమిన్స్ ను కొనుగోలు చేయడం ద్వారా జట్టు ఎలాంటి విజయాలు సాధించిందో నేరుగా నిరూపించింది కావ్య. ఆ తర్వాత ఆమెను తిట్టిన వాళ్లే, పొగడడం ప్రారంభించారు. అట్టడుగునున్న జట్టును కప్ దక్కించుకునే స్థాయికి చేర్చిందని కితాబులు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ కావచ్చు. కానీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. ఏకంగా ట్రోఫీ గెలిచినంత పని చేసింది కావ్య. ఈ నేపథ్యంలో ఆమె కష్టాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ జట్టు కప్ గెలిచినంత సంతోషంలో ఉన్నామని చెబుతున్నారు. ఈ లెక్కన అభిమానుల మనసు ఆ స్థాయిలో గెలుచుకుంది అంటే.. కావ్య వ్యూహ చతురత ఏమిటో.. ఆమె ఎలా ఆలోచిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.