https://oktelugu.com/

Sachin : ఆకాశాన్ని తాకేలా స్టంప్స్.. ఆశ్చర్యపోయిన సచిన్ టెండూల్కర్.. ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయంటే?

క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గాడ్ గా అతడు మన్ననలు పొందుతున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. అతడి రికార్డులు ఇంకా చెక్కుచెదరలేదు.

Written By: NARESH, Updated On : November 17, 2024 10:07 pm
Follow us on

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత సచిన్ టెండూల్కర్.. తనదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. ఇటీవల సౌత్ ఆఫ్రికా అడవుల్లో సందడి చేశారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో సతీమణితో కలిసి పర్యటించారు. అక్కడ సరదాగా క్రికెట్ కూడా ఆడారు. ఆ విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా సచిన్ పంచుకుంటున్నారు.. క్రికెట్ మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. ఆమధ్య లండన్ లో సచిన్ టెండూల్కర్ లారాను కలిశారు. వారిద్దరూ సరదాగా కాఫీ తాగారు. లండన్ వీధుల్లో తిరుగుతూ.. నాడు వారు ఆడిన మ్యాచ్ లకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అయితే ఇప్పుడు సచిన్ విహారయాత్రలో ఉన్నారు. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో చెప్పలేదు కానీ.. తనను అనుసరించే నెటిజన్లకు ఒక చిక్కు ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్పాలని ట్విట్టర్ వేదికగా ఆయన కోరారు.

సతీమణితో కలిసి విహారయాత్ర..

సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన సతీమణితో కలిసి విహారయాత్రలో ఉన్నారు. ఇందులో భాగంగా ఒక అందమైన ఫోటోను తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆ ఫోటోలో సచిన్ టెండూల్కర్ చేతిలో బ్యాట్ లేకపోయినప్పటికీ.. బ్యాటింగ్ చేస్తున్నట్టు ఫోజు ఇచ్చారు. ఆయన వెనకాల ఒక చెట్టు మూడు వేరువేరు కొమ్మలతో నిటారుగా పెరిగింది. చూడడానికి అది అత్యంత భారీగా ఉంది. దీంతో సచిన్ టెండూల్కర్ ఆ ప్రాంతంలో సేద తీరారు. ఆయనకు అమితంగా ఇష్టమైన ఫోటోను ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నారు. ఆ చెట్లు క్రికెట్ స్టంప్స్ ను పోలివున్నాయి. అయితే ఆ చిత్రాన్ని ఉద్దేశించి ” ఏ అంపైర్ ఇలాంటి స్టంప్స్ రూపొందించారు మీరు చెప్పగలరా”అంటూ తన ఫ్యాన్స్ కు ప్రశ్న అందించారు.. సచిన్ చెప్పినట్టుగానే ఆ మూడు చెట్ల కొమ్మలు క్రికెట్ స్టంప్స్ లాగా ఉన్నాయి. వాటి ముందు సచిన్ బ్యాటింగ్ చేస్తున్నట్టు ఫోజు ఇచ్చి ఫోటో దిగాడు. అయితే సచిన్ అడిగిన ప్రశ్నకు అభిమానులు రకరకాలుగా సమాధానం చెబుతున్నారు. ఒక వ్యక్తి స్టీవ్ బక్నర్ అని సమాధానం చెప్పాడు. మరొక వ్యక్తి డారెల్ హైర్ అని రాశాడు. ఇంకొక వ్యక్తి మిడిల్ స్టంప్ ను బక్నర్.. లెగ్స్ స్టంప్ ను డారెల్ హార్పర్ అమర్చి ఉంటారని వ్యాఖ్యానించాడు.. మొత్తానికి సచిన్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. అయితే ఈ ఫోటోకు వేలాదిమంది అభిమానులు తమ స్పందనలు తెలియజేశారు. ఫ్యాన్స్ ఇంతగా రియాక్ట్ అయినప్పటికీ … సచిన్ మాత్రం తాను ఏ ప్రాంతంలో విహారయాత్రలో ఉన్నానో చెప్పకపోవడం విశేషం. అయితే కొంతమంది ఆ ప్రాంతం ఆఫ్రికాలో ఉందని.. మరి కొంతమందేమో యూరప్ అని వ్యాఖ్యానించారు.