Rohith sharma : ఇటీవల టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి వార్తలు వినిపించాయి. రోహిత్ కచ్చితంగా వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని.. టెస్టులలో మాత్రమే కొనసాగుతాడని పలు మీడియా సంస్థలలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే దీనిపై రోహిత్ స్పందించలేదు. రోహిత్ మౌనంగా ఉండడంతో ఇది నిజమని అందరూ అనుకున్నారు. బీసీసీఐ వర్గాలు కూడా అదే విధంగా సంకేతాలు ఇవ్వడంతో.. రోహిత్ రిటైర్మెంట్ ఇక లాంచనమే అని భావించారు. ఎందుకంటే టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు రోహిత్ ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఆ లెక్కన రోహిత్ కూడా టీమ్ ఇండియా ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత అదే నిర్ణయం తీసుకుంటాడని అందరూ భావించారు. కానీ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ తాను వన్డేల నుంచి వెళ్లిపోయేది లేదని.. చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించాడు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ ఉంటాడని.. రోహిత్ ఆడతాడని అందరూ ఒక అంచనాకొచ్చారు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో అతడు తన శరీర సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచుకుంటేనే ఆ వన్డే ట్రోఫీలో ఆడగలడు. అలా ఆడాలంటే రోహిత్ కచ్చితంగా తన శరీరంపై దృష్టి సారించాలి. మిషన్ 2027 లో భాగంగా రోహిత్ ఇప్పుడు అదే పని చేస్తున్నాడు.
Also Read ; అదే రోహిత్ కెప్టెన్సీలో గొప్పతనం.. అందువల్లే టీమిండియా గెలిచింది..
అక్కడ జరుగుతుంది కాబట్టి..
2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, నమీబియా, కెన్యా వేదికలుగా జరుగుతుంది. ఈ మైదానాలలో తక్కువ పరుగులు చేసి విజయాలు ఆశించడం దాదాపు అసాధ్యం. భారీగా పరుగులు చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. అలా జరగాలంటే రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే సరిపోదు. ఉన్నంతసేపు దూకుడు కొనసాగిస్తే అది జట్టు అవసరాలకు సరిపోదు. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ లాగా రోహిత్ దాదాపు 30 ఓవర్ల పాటు ఆడాల్సి ఉంటుంది. అలా జరగాలంటే రోహిత్ తన శరీర ఆకృతి పై దృష్టి సారించాలి. అని ఓవర్ల పాటు ఆడే విధంగా తన దేహాన్ని అతడు మలచుకోవాలి. ఇప్పుడు అదే ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక నాయర్ తో రోహిత్ ఇప్పటికే మాట్లాడారని.. అతడితో కలిసి పనిచేస్తారని తెలుస్తోంది. అభిషేక్ నుంచి బ్యాటింగ్, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చిట్కాలు తీసుకుంటారని సమాచారం. ఇక ఐపీఎల్ లో దినేష్ కార్తీక్ కు అభిషేక్ నాయర్ మెంటార్ గా పనిచేశారు. ఇక ఆ సమయంలో దినేష్ కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బెంగళూరు జట్టు సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. మరి ఇప్పుడు రోహిత్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ లో అలానే చేస్తాడేమో చూడాల్సి ఉంది. అన్నట్టు ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేశాడు. అయితే అదే ఫామ్ ను ఛాంపియన్స్ ట్రోఫీలో చూపించలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్ మినహా.. మిగతా అన్నింట్లోనూ అతడు 10 ఓవర్ల లోపే అవుట్ అయ్యాడు.. మిగతా ఆటగాళ్లు ఆడారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే జట్టు ఇబ్బందుల్లో పడేది. రోహిత్ త్వరగా అవుట్ కావడం వల్ల.. మిగతా ప్లేయర్లపై విపరీతమైన ఒత్తిడి పడింది. కొన్ని సందర్భాల్లో విరాట్ కోహ్లీ విఫలం కావడంతో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ నిలబడాల్సి వచ్చింది. లేకుంటే టీమిండియా కు ఫలితాలు మరో విధంగా వచ్చేవి.
Also Read : ఓరయ్యా ఇదేం బౌలింగ్..నా కాళ్ళనే విరగొట్టేందుకు ప్రయత్నించావ్.. బౌలర్ పై రోహిత్ చిందులు.. వైరల్ వీడియో