Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత దారుణమైన రికార్డు నమోదు చేశాడు. పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కనీసం రెండు అంకెల స్కోర్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు సిడ్ని టెస్ట్ కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలవల్ల అతడు మ్యాచ్ కు దూరమయాడని చెబుతున్నప్పటికీ.. ఫామ్ కోల్పోవడంతోనే అతడిని దూరం పెట్టారని వార్తలు వస్తున్నాయి.
దారుణమైన ఆట తీరు ప్రదర్శించడంతో రోహిత్ శర్మ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆట అద్వానంగా ఉందని.. ఇకపై ఆడింది చాలని.. సాధ్యమైనంతవరకు రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని.. అందువల్ల టెస్ట్ క్రికెట్ కు కూడా టి20 మాదిరిగానే రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించారు. ఏకంగా హ్యాపీ రిటర్మెంట్ అనే యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.. దీంతో రోహిత్ సిడ్నీ టెస్ట్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ టీమిండియా ఓడిపోక తప్పలేదు. ఆరు వికెట్ల తేడాతో సిడ్నీ టెస్ట్ లో ఓటమి మాత్రమే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశాన్ని కూడా కోల్పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలం కావడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత దారుణమైన రికార్డును నెలకొల్పాడు. టీమిండియా చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన సారధిగా అతడు నిలిచాడు.
మూడు టెస్టులు ఆడి..
ఈ టోర్నీలో రోహిత్ శర్మ మూడు టెస్టులు ఆడాడు. వ్యక్తిగత కారణాలవల్ల అతడు పెర్త్ టెస్ట్ ఆడలేదు. పెర్త్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ భార్య ప్రసవించింది. బాబుకు జన్మనిచ్చింది. దీంతో తన భార్య వద్ద ఉండాల్సి రావడంతో రోహిత్ తొలి టెస్ట్ కి దూరంగా ఉన్నాడు. ఆ టెస్టులో భారత్ గెలిచింది.. ఆ తర్వాత అడిలైడ్ లో జరిగిన టెస్ట్ కు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు. నాటి నుంచి టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొన్నారు.. బ్రిస్ బేన్ మినహా మెల్ బోర్న్, సిడ్ని టెస్టులలో టీమిండియా ఓడిపోయింది. సిడ్ని టెస్ట్ కు రోహిత్ దూరమయ్యాడు. మూడు టెస్టులు ఆడిన రోహిత్ 6.20 యావరేజ్తో 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే దశలో అత్యంత చెత్త రికార్డు నెలకొల్పిన కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. 2011 సీజన్లో ధోని 96 పరుగులు, 1981లో సునీల్ గవాస్కర్ 118 పరుగులు, 1947లో లాలా అమర్నాథ్ 140 పరుగులు చేశారు. అయితే రోహిత్ నెలకొల్పిన రికార్డు అత్యంత చెత్తగా ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బహుశా ఇంతటి దారుణమైన గణాంకాలను మరే ఇండియన్ కెప్టెన్ నమోదు చేయకపోవచ్చు అని వారు పేర్కొంటున్నారు. ” రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమయ్యాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. న్యూజిలాండ్ సిరీస్ లోనూ అతడు ఇదే తీరుగా విఫలమయ్యాడు. ఇలా వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ అతడు వినియోగించుకోవడం లేదు. అందువల్లే సిడ్నీ టెస్ట్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్లో భారత్ గెలవలేదు. దారుణంగా ఓడిపోయిందని” టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.