Rohit Sharma : సందిగ్ధం విడిపోయింది. ప్రశ్నకు సమాధానం లభించింది. ఉత్కంఠకు తెర పడింది. మొత్తానికి శుక్రవారం అడిలైడ్ వేదికగా జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓపెన్ ఎవరో తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించడంతో ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. సందిగ్ధతకు రోహిత్ శర్మ శుభం కార్డు వేయడంతో అడి లైడ్ టెస్టులో టీమిండియా ఓపెనర్ ఎవరో తేలిపోయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఇతడు ఓపెనర్ గా బరిలోకి వచ్చాడు. అయితే స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఏకంగా 161 రన్స్ చేశాడు. మరో ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా 70కి పైగా పరుగులు చేశాడు. దీంతో కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ తో ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ” రాహుల్ అద్భుతంగా ఆడాడు. అతనిలో సరికొత్త కోణాన్ని చూపించాడు. అతడు పెర్త్ వేదికగా ఆడుతుంటే నేను నా కొడుకుని ఎత్తుకొని ఆ మ్యాచ్ చూశాను. గొప్పగా అనిపించింది. భారత జట్టు సాధించిన విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్ టెస్ట్ లోనూ అతడే ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని” రోహిత్ స్పష్టం చేశాడు.
రోహిత్ ఏ స్థానంలో అంటే..
రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయం కావడంతో.. రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే చర్చ మొదలైంది. అయితే రోహిత్ అయిదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ రంగంలోకి దిగుతారు. వన్ డౌన్ ఆటగాడిగా గిల్ బ్యాటింగ్ చేస్తాడు. అతని తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగుతాడు. కోహ్లీ అనంతరం పంత్ బ్యాటింగ్ కి దిగుతాడు. ఆ తర్వాతే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాడు. పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జోడి అద్భుతంగా ఆడిన నేపథ్యంలో.. అదే ఒరవడి కొనసాగించాలని రోహిత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఓపెనింగ్ దేవుడి విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా.. కొనసాగిస్తున్నట్టు సమాచారం..”రోహిత్ నిర్ణయం బాగుంది. కెప్టెన్ అనే అహం లేదు. అతడి ముందుచూపు జట్టుకు లాభం చేకూర్చే విధంగా ఉంది. ఈ ధోరణి ఇలానే కొనసాగిస్తే భవిష్యత్తు కాలంలో టీమిండియా మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని” క్రికెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా చెబుతున్నారు.