https://oktelugu.com/

Rishabh pant: రిషబ్ పంత్ కీలక నిర్ణయం.. వచ్చే ఐపిఎల్ సీజన్లో ఆ జట్టులోకి ఎంట్రీ..

 మరో ఆటగాడు ఆ స్థానంలో ఉంటే ఎలా ఉండేవాడు తెలియదు గాని.. కానీ ఆ ప్రమాదాన్ని.. ప్రాణాలు పోయే ఉత్పాతాన్ని రిషబ్ పంత్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మొండిగా నిలబడ్డాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 21, 2024 / 12:43 PM IST

    Rishabh pant

    Follow us on

    Rishabh pant: టీమిండియాలో రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెబుతుంటారు. ఎందుకంటే సరిగా ఏడాదిన్నర క్రితం అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు. దాదాపు ఏడాది పాటు మంచంలోనే ఉన్నాడు. మూడు నెలల పాటు కనీసం బ్రష్ కూడా చేసుకోలేదు. కింది దవడకు విపరీతమైన గాయమైంది. పై దవడ దెబ్బతిన్నది. వెన్నెముక కు గాయమైంది. ఒక కాలుకు తీవ్ర గాయమై, అధికంగా రక్తస్రావం జరిగింది.. ఇక తలకైతే ఎన్ని కుట్లు పడ్డాయో తెలియదు. వాస్తవానికి ప్రమాదం జరిగిన దృశ్యం చూస్తే అతడు బతికి ఉన్నాడని ఎవరూ అనుకోలేదు. కొందరైతే వేరే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. అయినప్పటికీ రిషబ్ పంత్ కోలుకున్నాడు. ఫినిక్స్ పక్షి లాగా లేచాడు. మంచం లో అలా అచేతనంగా పడి ఉన్నప్పటికీ.. తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. ధైర్యాన్ని నింపుకున్నాడు. నిబ్బరాన్ని ఒంట పట్టించుకున్నాడు. క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడు. బ్యాట్ చేతపట్టాడు. తన చిచ్చరపిడుగుతనాన్ని రుచి చూపించాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. గతానికంటే భిన్నంగా ఆడి.. ఆ జట్టును తల ఎత్తుకొనేలా చేశాడు.

    అదే ఊపును టి20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాడు రిషబ్ పంత్. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సరి కొత్తగా కనిపించాడు. శ్రీలంకతో టి20 సిరీస్ లోనూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కు భవిష్యత్తు ఆశా కిరణం లాగా కనిపిస్తున్నాడు. అయితే ఇటీవలి ఐపిఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున అద్భుతంగా ఆడిన రిషబ్ పంత్.. వచ్చే సీజన్ లో జట్టు మారే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియా అతడు చేసిన పోస్ట్ ఇందుకు బలం చేకూర్చుతోంది. ఎందుకంటే రిషబ్ పంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ అనుకరించి ఓ సోఫాలో కూర్చున్నాడు. దానికి తలైవా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానిని రజనీకాంత్ ట్యాగ్ చేశాడు.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సైతం ఇలాగే రజినీకాంత్ స్టైల్ లో ఓ ఫోటో దిగి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అతడు ఐపీఎల్లో చెన్నై జట్టుకు ఆడటం మొదలుపెట్టాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి 2023 సీజన్ వరకు చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వాయించాడు. 2024లో కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకొని.. రుతు రాజ్ గైక్వాడ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ కూడా చెన్నై జట్టులోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. రిషబ్ కూడా ధోని స్థాయిలోనే వేగంగా కీపింగ్ చేస్తాడు. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తాడు. అద్భుతమైన షాట్లు కొట్టి అలరిస్తుంటాడు. మరోవైపు వచ్చే సీజన్లో ధోని ఆడేది అనుమానమేననే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అతడి స్థానాన్ని రిషబ్ పంత్ తో భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సైతం రిషబ్ పంత్ కు సాదర స్వాగతం పలుకుతున్నారు. తలా ధోని స్థానాన్ని భర్తీ చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.