RCB Vs DC IPL 2025: ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఒకానొక దశలో 3.5 ఓవర్ లోనే 61 రన్స్ చేసింది. అప్పటికి సాల్ట్ (37), విరాట్ కోహ్లీ (22) విపరీతమైన ఊపు మీద ఉన్నారు. దీంతో బెంగళూరు 300 పరుగులు ఈజీగా చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఉన్నట్టుండి సాల్ట్ అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రన్ అవుట్ కావడం.. విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ కావడం.. పడిక్కల్(1), లివింగ్ స్టోన్ (4), జితేష్ శర్మ(3) ఢిల్లీ బౌలర్ల ముందు చేతులెత్తేయడంతో.. బెంగళూరు స్కోర్ అమాంతం పడిపోయింది.. ఫలితంగా 163 పరుగులు చేయగలిగింది. వాస్తవానికి సొంతమైదానంలో 300కు మించి పరుగులు చేస్తున్నారు అనుకుంటే.. ఆటగాళ్లు విఫలం కావడంతో 163 పరుగుల వరకే ఆగిపోయింది.
Also Read: ఇది నా అడ్డా, ఇక్కడ నేనే తోపు… బెంగళూరులో చితక్కొట్టిన కేఎల్ రాహుల్
అంత సులభం కాలేదు..
పేరుకు 164 పరుగులే అయినప్పటికీ.. ఢిల్లీ జట్టుకు ఆ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాలేదు. భువనేశ్వర్ దెబ్బకు మెక్ గూర్క్(7), అభిషేక్ పోరెల్(7) సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరుకున్నారు. యష్ దయాల్ వేసిన అద్భుతమైన బంతికి డూ ప్లెసిస్(2) అవుట్ అయ్యాడు. ఢిల్లీ సారధి అక్షర్ పటేల్ (15) సుయాష్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. ఇక అప్పటికే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోవడం.. కేవలం 58 పరుగులు మాత్రమే చేయడంతో.. ఢిల్లీ జట్టు పైన విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఇక ఈ దశలో కేఎల్ రాహుల్ (53 బంతుల్లో ఆరు సిక్సర్లు, 7 ఫోర్ లతో 93*) స్టబ్స్(38*) దూకుడుగా ఆడి ఢిల్లీ జట్టును గెలిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 111 పరుగుల భాగస్వామ్య నెలకొల్పారు.. ముఖ్యంగా కేఎల్ రాహుల్ బెంగళూరు బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఢిల్లీ జట్టు విజయం మరో ఆరు వికెట్లు మిగిలి ఉండగానే ఖాయమైంది. ప్రారంభంలో ఢిల్లీ జట్టుకు సంబంధించిన నాలుగు వికెట్లను వెంట వెంటనే పడగొట్టిన బెంగళూరు బౌలర్లు.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయారు.. ఇక ప్రారంభంలో తడబడిన ఢిల్లీ ఆటగాళ్లు.. తర్వాత కుదురుకున్నారు. మొత్తంగా అనుక్షణం మలుపులు తిరుగుతూ.. చివరికి విజయం ఢిల్లీ సొంతమైంది. కేఎల్ రాహుల్.. తనకు మాత్రమే సొంతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. చెత్త బంతులను బౌండరీ లైన్ కు పంపిస్తూనే.. ఇబ్బంది అనుకున్న బంతులను వదిలేశాడు.. మొత్తానికి నేను దయగా ఉండేందుకే నిర్దయగా ఉంటానని కేఎల్ రాహుల్ నిరూపించాడు.. మైదానంలోకి వచ్చింది మొదలు.. చివరి వరకు కేఎల్ రాహుల్ ఓపికతో ఆడాడు. వికెట్ పడకుండా ఆడాడు.. స్టబ్స్ మీద ఒత్తిడి లేకుండా చూశాడు. అంతిమంగా ఢిల్లీ జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత.. కే ఎల్ రాహుల్ బ్యాట్ తో చిన్న స్వామి మైదానాన్ని బలంగా తడిమాడు. ఇది నా సొంత గడ్డ అని.. ఇందులో నాకు మాత్రమే అద్భుతమైన రికార్డులు ఉన్నాయని.. పరోక్షంగా చెప్పాడు.
Also Read: అక్షర్ బ్రో.. నీది బుర్రా.. పాదరసమా.. RCB ని నేల నాకించావ్ కదా!