Ravindra Jadeja: అభిమానులకు మరో షాక్.. మరో దిగ్గజ టీమిండియా ప్లేయర్ రిటైర్మెంట్

టీమిండియాలో రవీంద్ర జడేజాకు మేటి ఆల్ రౌండర్ అనే పేరు ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో సత్తా చాట గలడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు సిద్ధంగా ఉంటాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 6:36 pm

Ravindra Jadeja

Follow us on

Ravindra Jadeja: టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. 17 సంవత్సరాల తర్వాత మరోసారి పొట్టి ప్రపంచ కప్ అందుకొని రికార్డు సృష్టించింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల సరసన నిలిచింది. 2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ గ్రూప్ దశలోనే వచ్చింది. సరిగా అదే దేశం వేదికగా 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచి సత్తా చాటింది. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు.. ఇప్పుడు వారిని అనుసరిస్తూ మరో దిగ్గజ ఆటగాడు కూడా టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.

టీమిండియాలో రవీంద్ర జడేజాకు మేటి ఆల్ రౌండర్ అనే పేరు ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో సత్తా చాట గలడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు సిద్ధంగా ఉంటాడు. టీమిండియా సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు.. అయితే అటువంటి రవీంద్ర జడేజా అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాట్ తో రాణించలేకపోయాడు. బంతితో ఆకట్టుకోలేకపోయాడు . ఫైనల్ మ్యాచ్ లోనూ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఆమధ్య అతడి ఎంపిక పట్ల విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ అతని ఆట తీరు పెద్దగా మారలేదు. ఇక టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో.. రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు..

ఇక ఇటీవల ఐపీఎల్లో కూడా రవీంద్ర జడేజా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన భీకరమైన బ్యాటింగ్ తో చెన్నై జట్టును గెలిపించాడు.. ఐదోసారి ట్రోఫీ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అదే జోరును వన్డే వరల్డ్ కప్ లోనూ చూపించాడు.. కానీ ఇటీవలి ఐపీఎల్ లో తేలిపోయాడు. అదే పేలవమైన ఫామ్ ను టి20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాడు.. మిగతా ఆటగాళ్లు రాణించారు కాబట్టి.. రవీంద్ర జడేజా వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు.. మొత్తానికి యువతరానికి అవకాశం ఇచ్చేందుకు తాను టి20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు జడేజా ప్రకటించాడు. టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.