https://oktelugu.com/

Jasprit Bumrah: టీమిండియా కష్టాల్లో ఉంటే.. కాపాడే కల్కీ అతడే..

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. అయితే టీమిండియా అప్రతిహత విజయాలలో అతడు కీలక పాత్ర పోషించాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 30, 2024 6:42 pm
    Jasprit Bumrah

    Jasprit Bumrah

    Follow us on

    Jasprit Bumrah: ప్రత్యర్థి ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే.. జట్టు కోలుకోలేని కష్టాల్లో పడితే.. అప్పుడు బంతి అతడి చేతిలోకి వెళుతుంది.. అంతే ఒక్కసారిగా అసాధ్యం కాస్త సుసాధ్యం అవుతుంది. పరాజయం నుంచి జయించాం అనే మాట వినిపిస్తుంది. వేగంగా.. చేతులను లాఘవంగా.. బంతిని అంచనా వేయలేని విధంగా.. అతడు సంధిస్తుంటే ప్రత్యర్థి బ్యాటర్లు చేతులెత్తేస్తారు. అతడికి పాదాక్రాంతమవుతారు. ఇంతకీ అతడు ఎవరంటే..

    జస్ ప్రీత్ బుమ్రా.. టీమిండియా తరఫున స్పీడ్ గన్. వేగంగా బంతులు వేస్తాడు. అంతే వేగంగా వికెట్లు పడగొడతాడు..ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, యార్కర్ లతో నిప్పులు చెరుగుతాడు.. అందుకే అతడిని టీమిండియా పాలిట.. ఆపద్బాంధవుడు అని పిలుస్తారు. అందుకే షేన్ బాండ్ లాంటి బౌలర్లు అతడిని ప్రపంచంలోనే మేటి పేసర్ అని కితాబిచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లు.. అతడి బౌలింగ్ ను ఓహో అని పొగుడుతున్నారంటే.. అతడి బౌలింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

    17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. అయితే టీమిండియా అప్రతిహత విజయాలలో అతడు కీలక పాత్ర పోషించాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. వాస్తవానికి బుమ్రా కంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫారూఖీ ఎక్కువ వికెట్ల తీశాడు.. అయితే బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం అందించడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది.. బుమ్రా కేవలం వికెట్లు మాత్రమే కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు తీయకుండా కట్టడి చేశాడు. అందువల్లే అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం అందించారు. ఈ టోర్నీలో ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేస్తూ.. వాటిని లోపలికి స్వింగ్ చేస్తూ.. సరికొత్త బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాటర్లకు బుమ్రా రుచి చూపించాడు. మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా.. బ్యాటర్ల బలహీనతలను పసిగట్టి బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా అమెరికా మైదానాలపై షార్ట్ పిచ్ బంతులు వేస్తూ.. తనలో అసలు సిసలైన బౌలర్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు.

    ఇక ఈ టోర్నీలో 8 మ్యాచులు ఆడిన బుమ్రా ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. అతడి సగటు 8.26 మాత్రమే అయినప్పటికీ.. ఎకానమీ 4.17 ను దాటలేదు. పాకిస్తాన్ జట్టు పై మూడు, ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై మూడు, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాపై రెండేసి వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో ఓటమి అంచులో నిలిచిన భారత జట్టును తన అద్భుతమైన బౌలింగ్ తో విజయం వైపు చేర్చాడు. 18 ఓవర్ లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ తీశాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెరిగింది.. అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా కూడా బుమ్రా లాగే బౌలింగ్ వేయడంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.