India Vs South Africa Final: వరల్డ్ కప్ ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరో తెలుసా? ఆ మెడల్ ఎవరికి వచ్చిందంటే?

టీమిండియా టి20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆటగాళ్లు మొత్తం ఒకచోట చేరి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ ప్రధానం చేసేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషా ను ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 6:29 pm

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: టి20 ప్రపంచ కప్ లో బీసీసీఐ ఈసారి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.. మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభ చూపిన ఆటగాడికి మెడల్ ప్రధానం చేయడం మొదలుపెట్టింది. గ్రూప్, సూపర్ -8, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లలో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు మెడల్స్ అందించింది. ఇది ఆటగాళ్లలో స్ఫూర్తి నింపింది. పోరాడే తత్వాన్ని నేర్పింది.. 2022 t20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఓటమి, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోల్పోవడం.. వంటి పరిణామాల నేపథ్యంలో.. జట్టు ఆటగాళ్లలో నైపుణ్యాన్ని మరింత పంచేందుకు ఈ మెడల్ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. బీసీసీఐ ఏ లక్ష్యంతో అయితే దీనిని ప్రారంభించిందో.. టి20 వరల్డ్ కప్ సాధన ద్వారా అది నెరవేరింది..

ఇక శనివారం బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టింది.. 2014 తర్వాత మరోసారి ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఈసారి నాటి ఫలితాన్ని పునరావృతం చేయకుండా, విజయంతో కప్ మరోసారి దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రతిభ చూపింది.. కీలకమైన సమయంలో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు తేలిపోయినప్పటికీ.. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, బుమ్రా పదునైన బంతులు వేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో బ్యాటర్లు, పేస్ బౌలర్ల తర్వాత.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే క్యాచ్ పట్టి జట్టు విజయాన్ని సూర్య కుమార్ యాదవ్ ఖాయం చేశాడు.

టీమిండియా టి20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆటగాళ్లు మొత్తం ఒకచోట చేరి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ ప్రధానం చేసేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషా ను ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జై షా మెడల్ ను సూర్య కుమార్ యాదవ్ కు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జై షా కీలక వ్యాఖ్యలు చేశారు..” వాస్తవానికి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మనం పటిష్ట స్థితిలో నిలిచాం. ఈ తెగువతో అన్నింటినీ చేయించాం. ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు టోర్నీ మొత్తం భారత ఆటగాళ్లు అనితర సాధ్యమైన పట్టుదల చూపించారు. ద్రావిడ్, రోహిత్ పదేపదే చెబుతున్నారు. ఆటగాళ్ల పాత్ర గురించి వివరిస్తున్నారు. ఆటగాళ్లు మొత్తం పకడ్బందీగా వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. వారు దేన్నీ వదిలిపెట్టలేదని” జై షా వ్యాఖ్యానించారు. అనంతరం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడారు.

సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టిన విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అతని ఆట తీరును కొనియాడారు..” అతడు ప్రాక్టీస్ అద్భుతంగా చేశాడు. ఇలాంటి రిలే క్యాచ్ లు 50 దాకా పట్టాడు. మైదానంలో కూడా అతడు రిలే క్యాచ్ పట్టి.. ఒత్తిడిలోనూ తాను మెరుగ్గా క్రికెట్ ఆడగలనని నిరూపించాడు. వాస్తవానికి ఆ బంతిని అంచనా వేయడంలో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన పరిణతి చూపించాడు. బౌండరీ లైన్ తగలకుండా వేగంగా పరిగెత్తాడు. ఆ బంతిని పైకి ఎగిరేసి తిరిగి క్యాచ్ పట్టే విశ్వాసాన్ని చూపించాడు. వీటన్నింటినీ క్షణాల్లో చేశాడు. అందువల్లే సూర్య సమర్థవంతమైన ఫీల్డర్.. భారత జట్టు గెలవడంలో ఈ క్యాచ్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని” దిలీప్ వ్యాఖ్యానించాడు.