Haris Rauf : అమెరికాలో వీధి రౌడీలా మారిపోయిన పాకిస్తాన్ ఆటగాడు.. వీడియో వైరల్

Haris Rauf అయితే ఆ అభిమాని తనను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే.. తాను అతడి మీదికి దూసుకెళ్లాల్సి వచ్చిందని రౌఫ్ స్పష్టం చేశాడు.

Written By: NARESH, Updated On : June 18, 2024 9:48 pm

Haris Rauf

Follow us on

Haris Rauf : మైదానంలో ఆడండ్రా బాబూ అంటే బలహీనమైన అమెరికా చేతిలో ఓడిపోతారు. ఐర్లాండ్ జట్టు పై చివరి నిమిషంలో గెలుస్తారు. చేతులోకి వచ్చిన క్యాచ్ లు వదిలేస్తారు. స్వల్ప స్కోర్ చేదించలేక చేతులెత్తేస్తారు. ఇవీ టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆట తీరుపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు. మైదానంలోనే కాదు.. బయట కూడా ఆ జోకులకు తగ్గట్టుగానే ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన ఉంది. తాజాగా ఓ పాకిస్తాన్ ఆటగాడికి సంబంధించిన వ్యవహార శైలి నెట్టింట తెగ చర్చకు దారి తీస్తోంది. ఇంతకీ ఆటగాడు ఏం చేశాడంటే..

పాకిస్తాన్ జట్టులో హ్యరీస్ రౌఫ్ అనే ఓ ఆటగాడు ఉన్నాడు. మెరుగ్గా బౌలింగ్ చేస్తాడనే పేరుంది. అయితే ఈ ఆటగాడు ఓ అభిమాని పై దాడికి దిగాడు. అమెరికాలో వీధి రౌడీలాగా రెచ్చిపోయాడు. ” ఇదంతా బాగోలేదు. అతనితో గొడవ వద్దూ” అతని భార్య వారిస్తున్నప్పటికీ వినలేదు. పైగా ఆగ్రహంతో ఆ అభిమాని పై దూసుకు వెళ్ళాడు. అయితే ఈ గొడవకు కారణం ఏంటో తెలియదు గాని.. ఆ అభిమాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే.. రౌఫ్ రెచ్చిపోయాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చర్చకు దారి తీస్తోంది.

ఆ వీడియో ప్రకారం.. ఆ అభిమాని భారతదేశానికి చెందిన వాడని రౌఫ్ భావించాడు. అయితే తనది ఇండియా కాదని, పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తిని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు. అతడు చెబుతున్న మాటలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అతనితో గొడవ పడవద్దని రౌఫ్ భార్య చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. ఇదే సమయంలో రౌఫ్ ను అతడి అభిమానులు కట్టడి చేశారు.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఏమంత బాగోలేదు. అమెరికా చేతిలో ఓడిపోయింది. భారత్ ఎదుట సాగిలపడింది. కెనడా, ఐర్లాండ్ జట్లపై విజయం సాధించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గ్రూప్ దశ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించింది. జట్టు పరాజయం పొందినప్పటికీ పాకిస్తాన్ దేశానికి చెందిన ఆరుగురు ఆటగాళ్లు ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వారిలో రౌఫ్ ఒకడు. అతడు తన కుటుంబంతో కలిసి అమెరికాలో రిలాక్స్ అవుతున్నాడు. అయితే ఆ అభిమాని తనను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే.. తాను అతడి మీదికి దూసుకెళ్లాల్సి వచ్చిందని రౌఫ్ స్పష్టం చేశాడు. మరోవైపు రౌఫ్ టి20 వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్లు ఆడాడు. 7 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో (3/21) మూడు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు.