T20 World Cup 2024 Super 8 : మరి కొద్దిగంటల్లో సౌత్ ఆఫ్రికా, అమెరికా సూపర్-8 పోరు.. మార్క్రమ్ సేన పైనే ఒత్తిడి

T20 World Cup 2024 Super 8 : ఇదే సమయంలో చోకర్ జట్టుగా పేరుపొందిన దక్షిణాఫ్రికా.. చివరి నిమిషంలో చేతులు ఎత్తేయకుండా.. ఒత్తిడిని జయించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : June 18, 2024 9:04 pm

South Africa and USA

Follow us on

T20 World Cup 2024 Super 8 : టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశ ముగిసింది. సూపర్ -8 మ్యాచ్ లకు రంగం సిద్ధమవుతోంది. సూపర్ -8 పోరులో దక్షిణాఫ్రికా, అమెరికా జట్లు తలపడనున్నాయి. వెస్టిండీస్ లోని ఆంటిగ్వా వేదికగా భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో అమెరికా కంటే దక్షిణాఫ్రికా మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంది.. ఎందుకంటే దక్షిణాఫ్రికా లీగ్ దశలో ప్రత్యర్థి జట్లపై ఏకపక్ష విజయాలను నమోదు చేయలేకపోయింది.. ముఖ్యంగా నేపాల్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో.. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.. గ్రూప్ -2 లో ఇంగ్లాండ్, ఆతిధ్య వెస్టిండీస్, అమెరికా జట్టతో దక్షిణాఫ్రికా కొనసాగుతోంది.. బ్యాటర్లలో డికాక్, హెండ్రిక్స్, మార్క్రం వంటి వారు తమ స్థాయికి తగ్గట్టుగా ఇంతవరకు ఆట తీరు ప్రదర్శించలేదు. ఇక దక్షిణాఫ్రికాకు ఈ టోర్నీలో కాస్తలో కాస్తంత ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది బౌలింగ్ మాత్రమే.. టి20 వరల్డ్ కప్ కు ముందు అన్రిచ్ నోర్ట్జే ఆశించినంత స్థాయిలో బౌలింగ్ వేయలేకపోయేవాడు. వేరే ఆప్షన్ లేక దక్షిణాఫ్రికా జట్టు అతడిని టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా ఆడిన అన్ని లీగ్ మ్యాచ్ లలో అతడు సత్తా చాటాడు.. 9 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా కొనసాగుతున్నాడు.. నోర్ట్జే తో పాటు సహచర పేస్ బౌలర్ ఓట్నిల్ బార్ట్ మాన్ కూడా సత్తా చాటుతున్నాడు.. వీరితోపాటు మార్కో జాన్సన్, కగిసో రబాడా కూడా తమ స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి బౌలింగ్ ప్రదర్శన మీదే బుధవారం నాటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం ఆధారపడి ఉంది..

ఇక అమెరికా జట్టు విషయానికొస్తే.. ఈ టీంలో 8 మంది భారతీయ, ఇద్దరు పాకిస్తాన్, వెస్ట్ ఇండియన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, డచ్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ టి20 వరల్డ్ కప్ లో ఆరంగేట్రం చేసిన అమెరికా జట్టు.. సూపర్ -8 దాకా రావడం ఒకంత ఆశ్చర్యమే.. బలమైన పాకిస్తాన్ జట్టును సూపర్ ఓవర్ లో ఓడించిన అమెరికా.. అంతకుముందు కెనడాతో జరిగిన మ్యాచ్లో రికార్డు స్థాయిలో చేజింగ్ చేసి విజయాన్ని దక్కించుకుంది. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ భారత జట్టుతో జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అదే వరుస ప్రదర్శించాడు. అమెరికా ఆటగాళ్లలో ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆండ్రీస్ గౌస్, కోరి అండర్సన్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్ అదరగొడుతున్నారు.

అయితే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పైన ఒత్తిడి ఎక్కువగా ఉంది. పైగా ఆంటిగ్వా మైదానం స్లో వికెట్ గా ఉంది. బంతి ఎటువైపు టర్న్ అవుతుందో అర్థం కాకుండా ఉంది. అలాంటప్పుడు టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా జట్టులో బౌలింగ్ పరంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. బ్యాటింగ్ ఆ జట్టును ప్రధానంగా ఇబ్బంది పెడుతోంది.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు తమ పూర్వపు లయను అందుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు.. ఇదే సమయంలో చోకర్ జట్టుగా పేరుపొందిన దక్షిణాఫ్రికా.. చివరి నిమిషంలో చేతులు ఎత్తేయకుండా.. ఒత్తిడిని జయించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

జట్ల అంచనా ఇలా

అమెరికా

మోనాంక్ పటేల్ (కెప్టెన్), జోన్స్, గౌస్, అండర్సన్, అలీ ఖాన్, హర్మిత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్, షాల్క్ విక్, స్టీవెన్ టేలర్, జహ్లాంగ్.

దక్షిణాఫ్రికా

మార్క్రం(కెప్టెన్), బార్ట్ మన్, కోట్జీ, క్వింటన్ డికాక్, జార్న్ పోర్ట్ మాన్, హెండ్రిక్స్, మార్కో జాన్సన్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, నోర్ట్జే, రబాడా, షమ్సీ, స్టబ్స్.