Pakistan Cricket: 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. 2022లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు ఆ స్థాయిలో ప్రదర్శన చేసింది లేదు. ఎంతో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ జట్టు జింబాబ్వేకంటే దారుణంగా ఆడుతోంది. సొంత దేశంలో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో వరుస ఓటములు ఎదుర్కొని.. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.
పాకిస్తాన్లో రిజ్వాన్, బాబర్, సల్మాన్ ఆఘా, ఖుష్ దిల్, షాహిన్ షా ఆఫ్రిది, నసీంషా, హారీస్ రౌఫ్ వంటి క్రికెటర్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేక పోతోంది. మైదానంలో దిగకముందు పులిలాగా.. మైదానంలో దిగిన తర్వాత పేపర్ పూరి లాగా మారుతుంది.. బాబర్ న్యూజిలాండ్ జట్టుతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ అందులో దూకుడు లేదు. పరుగులు తీయాల్సిన సందర్భంలో నెమ్మదిగా ఆడాడు.. ఇక భారత్ పై కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు చేయడానికి 77 బంతులు ఎదుర్కొన్నాడు. సౌద్ షకీల్ మాత్రం దూకుడుగా ఆడాడు. అయితే ఆ స్థాయిలో ఆట తీరును రిజ్వాన్ ప్రదర్శించలేక పోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టుకు సరైన ఓపెనర్లు కూడా లేకుండా పోయారు. దానివల్ల పాకిస్తాన్ జట్టు తీవ్రంగా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇక జట్టు ఎంపిక విషయంలో పాకిస్తాన్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమయ్యాయి. సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్..ఇలా ప్రతి విషయంలోనూ పాకిస్తాన్ జట్టు పొరపాట్లు చేస్తూనే ఉంది.
Also Read: ఇంగ్లాండ్ కు ఇదేం దరిద్రం.. అప్ఘాన్ చిత్తు చేసి పడేసింది
ఇంత దారుణమా?
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో గడచిన మూడు సంవత్సరాలలో 26 మంది సెలెక్టర్లు మారారు. నలుగురు కెప్టెన్లు మారారు. 8 మంది కోచ్ లు కూడా మారారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ టికెట్ లో పరిస్థితి ఎలా ఉందో.. దాదాపు వెయ్యి రోజుల వరకు స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేకపోయింది.. పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ వ్యవహార శైలి బాగా లేకపోవడంతో గ్యారీ కిర్ స్టెన్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ తీరుపై ఆరోపణలు చేశారు. సెలక్షన్ కమిటీలో పక్షపాత ధోరణి పెరిగిందని.. జట్టులో అనుకూలంగా ఉండే వారిని ఎంపిక చేయడం ఎక్కువైందని అతడు ఆరోపించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్ లు గా ముగ్గురు వచ్చారు. 2021 నుంచి 24 వరకు వివిధ ఫార్మాట్లకు సక్లయిన్ ముస్తాక్, అబ్దుల్ రెహమాన్, గ్రాంట్ బ్రాడ్ బర్న్, మహమ్మద్ హఫీజ్, అజర్ మహమ్మద్, జాసెన్ గిలెస్పీ, గ్యారీ కిర్ స్టెన్, వంటి వారు కోచ్ లు గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే వీరికి పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదు. దీనికి తోడు ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎడతెగని నిర్లక్ష్యం.. రాజకీయ జోక్యం పాకిస్తాన్ జట్టు పతనానికి కారణమైంది. దేశవాళి క్రికెట్ టోర్నీలను కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పక్కనపెట్టింది. డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టింది.
శారీరక సామర్థ్యం లేకపోవడంతో..
పాకిస్తాన్ క్రికెటర్లకు సరైన శారీరక సామర్థ్యం ఉండదు.. ఇటువంటి వాటిల్లో భారత్, ఆస్ట్రేలియా ఖచ్చితమైన లెక్కలతో ఉంటాయి. డాటా, మిగతా వ్యూహరచనను కచ్చితంగా పాటిస్తాయి. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ అత్యంత వెనుకబడి ఉంది.. ఆధునిక క్రికెట్లో స్పోర్ట్స్ సైన్స్, అనలటిక్స్ వంటి విషయాలలో పాకిస్తాన్ జట్టు సున్నాతో పోటీ పడుతుంది. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెటర్లు సిక్సర్లు కొట్టడం లేదని గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా పని చేసిన వ్యక్తి ఏకంగా మిలిటరీ క్యాంప్ లో శిక్షణ ఇచ్చాడు. ఆ శిక్షణ ఏ స్థాయి ఫలితం ఇచ్చిందో గత టి20 వరల్డ్ కప్ ను చూస్తే తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లల్లో స్ఫూర్తివంతమైన ఆట తీరును ప్రదర్శించాలనే తపన లేకుండా పోయింది. శారీరక సామర్థ్యం దారుణంగా కొరవడింది. జట్టు కోసం ఆడాలనే కాంక్ష తగ్గిపోయింది. దేశవాళి లో ప్రతిభ చూపుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడం.. రాజకీయ జోక్యాన్ని నివారించడం..కోచ్, కెప్టెన్ల విషయంలో ప్రతిభకు మాత్రమే పట్టం కట్టడం.. డాటా అనలిటిక్స్, స్పోర్ట్స్ సైన్స్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం.. వంటి మార్పులతోనే పాకిస్తాన్ జట్టు పూర్వ వైభవం సంతరించుకుంటుందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.