ENG Vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్(ENG vs AFG) జట్టుతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో అప్ఘానిస్తాన్ రేవు వైపే వెళ్లిపోయింది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా రెండవ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు సెమీస్ నుంచి నిష్క్రమించింది.
అప్ఘానిస్తాన్ ఇంగ్లాండ్ ఎదుట 326 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.. ఈ టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆల్ అవుట్ అయింది..జో రూట్(Joe Root) అద్భుతమైన సెంచరీ ఆకట్టుకున్నప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టుకు ఉపయోగం లేకుండా పోయింది.. 111 బంతుల్లో అతడు 11 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 120 రన్స్ చేశాడు. బెన్ డకెట్ (38), బట్లర్(38), బ్రూక్(25), ఓవర్టన్(27) పరుగులు చేశారు. అప్ఘానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్ జాయ్ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హాక్ ఫారుఖీ తలా ఒక వికెట్ సాధించారు..
అదరగొట్టిన ఇబ్రహీం
అప్ఘానిస్తాన్ ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 7 వికెట్లు నష్టపోయి 325 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్(177) దుమ్మురేపాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో అతడి ఏకంగా 177 రన్స్ చేశాడు. అజ్మతుల్లా ఓమర్ జాయ్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. మహమ్మద్ నబీ 24 బంతుల్లో పార్టీ పరుగులు చేశాడు. హస్మతుల్లా షాహిది 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు జోప్రా ఆర్చర్ 64 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆర్చర్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ ఒకానొక దశలో 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి దారుణమైన స్థితిలో పడింది. ఈ స్థితిలో జద్రాన్ భీకరంగా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా అప్ఘానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, కీలక సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు అవుట్ కావడం ఆ జట్టు ఓటమికి కారణమైంది.
ఇంగ్లాండ్ జట్టు విఫల చరిత్ర
ఇంగ్లాండ్ జట్టు 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించి ట్రోఫీ దక్కించుకుంది. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ అదే తిరుగా ఆడింది.. బజ్ బాల్ గేమ్ తో క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ ఇలా ఆఫ్గనిస్తాన్ జట్టుపై ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. క్రికెట్ పుట్టిన దేశం.. ఆ ఆట ఆడటంలో ఇలా ఎందుకు విఫలమవుతోందని వాపోతున్నారు.
Also Read: మావోళ్లకు చేతకాదు.. మీ ఆట సూపర్.. టీమిండియాకు జైకొడుతున్న పాకిస్తాన్ ఫ్యాన్స్..!