Nitish Kumar Reddy: సాధారణంగా టెస్ట్ క్రికెట్ అంటే ఆడే క్రికెటర్లకు ఓపిక ఉండాలి. కొత్త బంతి పాత పడే వరకు ఓపికతో ఎదురు చూడాలి. అప్పటివరకు పరుగులు చేయకపోయినా పర్వాలేదు.. డిఫెన్స్ ఆడితే సరిపోతుంది. బౌలర్లు రెచ్చగొట్టే బంతులు వేస్తారు.. ఊరించే బంతులను సంధిస్తారు. అయినా కూడా సహనాన్ని కోల్పోవద్దు. ఉద్వేగాన్ని ప్రదర్శించకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత మూడు టెస్టుల్లో చేసింది ఇదే. అందువల్లే అతని త్వరగా వికెట్ కోల్పోయాడు. విరాట్ కోహ్లీ కూడా ఆప్ స్టంపు బంతులను వదిలేయకుండా.. రెచ్చిపోయాడు.. దాని ఫలితాన్ని అనుభవించాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటివారు కూడా వేగంగా పరుగులు చేయాలనే తలంపుతోనే వెంటనే అవుట్ అయ్యారు. జట్టుకు బలమైన ఇన్నింగ్స్ నిర్మించకుండా మధ్యలో ఉన్న చేతులెత్తేశారు.. కానీ నితీష్ కుమార్ రెడ్డి అలా చేయలేదు.. తన ముందు క్రికెటర్లు చేసిన తప్పులను పునరావృతం చేయదల్చుకోలేదు. అందువల్లే అతడు సెంచరీ చేయగలిగాడు. అడ్డి మారి గుడ్డి దెబ్బగా శతకం బాదలేదు.. ఓర్పుగా ఆడాడు. నేర్పుగా పరుగులు తీశాడు.. జింకను వేటాడేందుకు సింహం ఎంత ఓపికతో ఉంటుందో.. అంత ఓపికను ప్రదర్శించాడు. అంతిమంగా సెంచరీ చేసి అదరగొట్టాడు.
అభిమానులు దండం పెట్టారు
నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమిండియా తడబాటుకు గురయింది. అప్పటిదాకా హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా పెవిలియన్ చేరుకున్నాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన సిరాజ్ కమిన్స్ వేసిన మూడు బంతులను ఎదుర్కొన్నాడు.. ఆ తర్వాత స్ట్రైకింగ్ రావడంతో నితీష్ కుమార్ రెడ్డి తదుపరి లాంఛనం పూర్తి చేశాడు. సెంచరీ చేసి ఎగిరి గంతేశాడు. ఆ సమయంలో ఆ ఒక్క పరుగు కోసం అభిమానులు దేవుడికి దండం పెట్టారు. అయితే లంచ్ వరకు నిలబడితే చాలు అనుకున్న స్థితి నుంచి.. వాషింగ్టన్ సుందర్ సహాయంతో ఆస్ట్రేలియా జట్టునుంచి మ్యాచ్ ను నితీష్ కుమార్ రెడ్డి లాగేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కాదు.. 10 వరల్డ్ కప్ లతో సమానమైన సెంచరీ చేశాడు. ప్యూర్ టెస్ట్ క్రికెట్ ఆడాడు.. ఇటీవల కాలంలో ఏ ఆటగాడు కూడా ఆడని ఇన్నింగ్స్ ఆడి నితీష్ కుమార్ రెడ్డి చూపించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కు మైండ్ పనిచేయకుండా చేశాడు. చాలాసార్లు ఫీల్డ్ ప్లేస్మెంట్ మార్చేలా చేశాడు.. ఎక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వకుండా నితీష్ ఆడాడు. హాఫ్ సైడ్ హాఫ్ స్టంప్ వచ్చిన ఒక బంతిని కూడా అతడు ఆడలేదు. కొత్త బంతి వచ్చినప్పుడు హాఫ్ సెంచరీ చేసి.. నితీష్ అను ఏంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా స్టార్క్ బౌలింగ్లో కవర్స్ మీదుగా కొట్టిన ఫోర్.. తగ్గేదే లేదు అన్నట్టుగా బ్యాట్ తో చూపించిన మేనరిజం కొన్ని సంవత్సరాల వరకు ఆస్ట్రేలియా ప్లేయర్లకే కాదు, టీమిండియా ఫ్యాన్స్ కు కూడా గుర్తుంటుంది. ముఖ్యంగా గ్యాప్స్ లో నితీష్ కుమార్ రెడ్డి బంతిని పంపించిన విధానం అద్భుతం. ఇలా ఏకంగా 3, 2 రన్స్ సులభంగా తీశాడు. 176 బంతులు ఎదుర్కొన్న అతడు ప్రతి బంతిని ఆడాడు. చిన్న తప్పుకు కూడా ఆస్కారం ఇవ్వలేదు. ఏ బంతి విషయంలోనూ అత్యుత్సాహానికి గురి కాలేదు.. పరుగులు చేయాలని కంగారు పడలేదు. క్రీజ్ లో నిలబడితే చాలు పరుగులు అవే వస్తాయని నమ్మకంతో ఆడాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను అలానే వదిలేశాడు. కచ్చితంగా బ్యాట్ తో కనెక్ట్ అవుతుందనుకుంటేనే షాట్ కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ తో అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించాడు. ఒకవేళ గనుక సుందర్ అవుట్ కాకుండా ఉండి ఉంటే.. అప్పుడు నితీష్ సెంచరీ చేసి ఉంటే.. చూడ్డానికి ఆ దృశ్యం కన్నుల పండువగా ఉండేది. చాలామందికి టెస్ట్ క్రికెట్ అంటే బోరింగ్ లాగా ఉంటుంది.. కానీ ఒకసారి నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చూస్తే వారి అభిప్రాయం కచ్చితంగా మారుతుంది.