Nitesh Kumar : పారిస్ వేదికగా జరుగుతున్న పారాలంపిక్స్ లో నితేష్ కుమార్ మెడల్ సాధించాడు. స్వర్ణ పతక ధారిగా ఆవిర్భవించాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో నితేశ్ బరిలోకి దిగాడు. తనకు ఎంతో ఇష్టమైన భగత్, మనోజ్ సర్కార్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఓడించి స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ పై మరింత ఎక్కువగా దృష్టి సారించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భగత్ స్వర్ణం సాధించాడు. అతడిని ఆదర్శంగా తీసుకొని.. తాను కూడా పారాలంపిక్ మెడల్ సాధించాలని నితేష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మూడు సంవత్సరాలుగా ముమ్మరంగా సాధన చేశాడు. చివరికి తన లక్ష్యాన్ని సాధించాడు. పారిస్ లో తను తలపడిన ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.
2009లో నితేశ్ రైలు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడి వయసు 15 సంవత్సరాలు. మొదట్లో అతడు ఫుట్ బాల్ విపరీతంగా ఆడేవాడు. ప్రమాదానికి గురై కాలును కోల్పోయాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం కుదుటపడినప్పటికీ.. తన పరిస్థితి దృష్ట్యా పాటలకు పూర్తిస్థాయిలో వేడుకోలు పలకాల్సి వచ్చింది. అనంతరం పూర్తిస్థాయిలో చదువులపై దృష్టి సారించాడు. ఐఐటీ మండిలో సీటు సంపాదించాడు. అనంతరం ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాడ్మింటన్ పై ఆసక్తి పెంచుకున్నాడు..పారా బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రమోద్ భగత్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. అతడి స్ఫూర్తితో ఫిట్ గా మారాడు.. కోల్పోయిన తనకాలును అమర్చుకునేందుకు పూణేలోని ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ లో చేరాడు. ఆ తర్వాత కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. అలా పూర్తిస్థాయిలో బ్యాడ్మింటన్ లో సాధన చేశాడు. మైదానంలో తీవ్రంగా కసరత్తు చేసి చివరికి పారా ఒలిపింక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని.. లక్ష్యానికి అది అడ్డు కాదని నిరూపించాడు.
కృత్రిమ కాలు అమర్చుకున్న తర్వాత నితేశ్.. కోర్టులో రేయింబవళ్లు సాధన చేశాడు. తనకు వైకల్యం ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా తనను తాను మార్చుకున్నాడు. అనితర సాధ్యమైన ఆట తీరును సొంతం చేసుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్లను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. ఐదింటికి 5 మ్యాచ్ లు గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. పారా ఒలింపిక్స్ లో సరికొత్త చరిత్రను తన పేరు మీద లిఖించుకున్నాడు.