Google doodle : వీల్ చైర్ లో అటొకరు ఇటొకరు.. ఈ గూగుల్ డూడుల్ వెనుక అంతటి కథ ఉంది..

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ.. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సరికొత్త ఆవిష్కరణలను ముందు ఉంచుతుంది. అంతేకాదు తన సెర్చ్ ఇంజన్ ముందు రకరకాల డూడుల్స్ ను ఏర్పాటు చేస్తూ ఉంటుంది . అయితే డూడుల్స్ ను రొటీన్ గా కాకుండా.. విభిన్నంగా ఏర్పాటు చేస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 5:20 pm

Google doodle

Follow us on

Google doodle : ప్రస్తుతం పారిస్ వేదికగా పారాలింపిక్స్ జరుగుతున్నాయి.. ఇందులో భాగంగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 7 వరకు వీల్ చైర్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఐకానిక్ క్లే కోర్టు లకు ప్రసిద్ధి చెందిన రోలాండ్ గారోస్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందులో పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన క్రీడలలో టెన్నిస్ ఒకటి. పారాలింపిక్స్ లో వీల్ చైర్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గూగుల్ సరికొత్త డూడుల్ ను ఏర్పాటు చేసింది.. గూగుల్ ఏర్పాటు చేసిన డూడుల్ లో ఇద్దరు పారా అథెట్లు పోటీ పడుతున్నారు. ఒకరిపై మరొకరు ఏస్ లు సంధించుకుంటున్నారు.. గూగుల్ రూపొందించిన డూడుల్ విశేషంగా ఆకట్టుకుంటున్నది. పారా టెన్నిస్ డూడుల్ పై క్లిక్ చేయగానే.. ఆ పోటీలకు సంబంధించిన విశేషమైన చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతేకాదు పారిస్ వేదికగా జరుగుతున్న పారా వీల్ చైర్ టెన్నిస్ పోటీలతో పాటు.. గతంలో జరిగిన పోటీలకు సంబంధించిన వివరాలు, విజేతల సమాచారం అందులో కనిపిస్తోంది.

పారా వీల్ చైర్ టెన్నిస్ పోటీలను పరిశీలిస్తే.. ఈ పోటీలు జాతీయ పారాలింపిక్ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతాయి.పారాలింపిక్ కమిటీలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. ఒక్కో పారాలింపిక్ కమిటీకి 11 అర్హత స్లాట్ లు అందుబాటులో ఉంటాయి. ఈ పోటీలలో పాల్గొనే అథ్లెట్లు కచ్చితంగా వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రస్తుత స్థానాన్ని కలిగి ఉండాలి. 2021 నుంచి 2024 మధ్య కనీసం రెండుసార్లు ప్రపంచ టీం కప్ ఈవెంట్లో పోటీపడి ఉండాలి. అందులో ఒకటి 2023 లేదా 2024 లో జరిగి ఉండాలి..

ఇక వీల్ చైర్ టెన్నిస్ క్రీడకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అంగవైకల్యంతో బాధపడుతున్న ఆటగాళ్లు కూడా టెన్నిస్ ఆడే విధంగా ఇందులో మార్పులు చేర్పులు చేశారు..స్కీయింగ్ ప్రమాదంలో మాజీ స్కీయర్ బ్రాడ్ పార్క్స్ పక్షవాతానికి గురైంది. వీల్ చైర్ కు పరిమితమైంది. అయినప్పటికీ ఆమె టెన్నిస్ లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. అలా ఆమె వీల్ చైర్ టెన్నిస్ క్రీడను తెరపైకి తెచ్చింది. 1976 నుంచి వీల్ చైర్ టెన్నిస్ క్రీడ మనుగడలో ఉంది. వీల్ చైర్ టెన్నిస్ లో పాల్గొనే ఆటగాళ్లకు రెండు బౌన్స్ ల వరకు బంతిని కొట్టడానికి అనుమతిస్తారు. 1992 బార్సిలోనా పారాలంపిక్స్ లో వీల్ చైర్ టెన్నిస్ పోటీలను తొలిసారిగా నిర్వహించారు. ఆ తరువాత ప్రతీ పారాలింపిక్స్ లోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.