https://oktelugu.com/

YSR Congress Party : వైసీపీ బలహీనపడితే ఏపీలో ఆ స్థానం ఆక్రమించే పార్టీ ఏది? కూటమికి ప్రత్యామ్నాయం ఉందా?

ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో వైసీపీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. ఇక పార్టీకి మనుగడ కష్టమన్న విశ్లేషణలను నేపథ్యంలో ఆందోళన పడుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : September 3, 2024 / 04:33 PM IST

    YSR Congress Party

    Follow us on

    YSR Congress Party : ఏపీలో వైసిపి బలహీన పడుతుందా?పూర్తిగా నిర్వీర్యం అవుతుందా? అదే జరిగితే పుంజుకునే పార్టీ ఏది? వైసీపీ క్యాడర్ ఎటు వెళ్తుంది?ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీ రాజ్యసభ సభ్యులు టిడిపిలోకి జంప్ అవుతున్న నేపథ్యంలో ఈ కొత్త చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 175 స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే గెలిచింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను నాలుగు చోట్ల విజయం సాధించింది. ఇక పార్టీ మనుగడ అసాధ్యం అనుకుంటున్న వారు పార్టీని వీడుతున్నారు. ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం గెలుపు ఊపులో ఉంది. అందుకే వీలైనంత వరకు వైసీపీని నిర్వీర్యం చేయాలని భావిస్తోంది.అందుకే ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను తీసుకుంటోంది.వ్యూహాత్మకంగా పార్టీతో పాటు ఆ పదవులకు రాజీనామా చేయిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వైసిపిని మరింత దెబ్బ కొట్టాలన్నది టిడిపి కూటమి లక్ష్యం. అందుకే ముందుగా ఆ పార్టీని నిర్వీర్యం చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    * 40 శాతం ఓటింగ్ తో పటిష్టం
    అయితే ఎన్నికల్లో సీట్ల పరంగా తడబడినా.. వైసిపి 40 శాతం ఓటు బ్యాంకును సాధించింది. ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న బలాన్ని తెలియజేసింది. అయితే తటస్తులు, విద్యాధికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకించడమే ఆ పార్టీ ఓటమికి కారణం. పొత్తులో భాగంగా ఆ మూడు పార్టీల మధ్య ఓట్ల సర్దుబాటు విజయవంతంగా పూర్తి కావడం కూడా.. వైసిపి దారుణ పరాజయానికి మరో కారణం. అయితే వైసీపీ సాధించిన 40 శాతం ఓటు బ్యాంకును అంత వేగం కూటమి నిర్వీర్యం చేయగలదా? ఇంకో పార్టీ తన వైపు తిప్పుకోగలదా? అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు.

    * ఏపీలో చాన్స్ లేదు
    ఇప్పటికిప్పుడు వైసిపి స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా… ఆ పార్టీకి ప్రజల్లో బలం లేదు. ప్రజలను ఆకర్షించే నాయకత్వం లేదు. ఎన్నికలకు ముందు షర్మిల బాధ్యతలు తీసుకున్నా.. ఆమె కాంగ్రెస్ పార్టీ గెలుపు కంటే జగన్ ఓటమిని కోరుకున్నారు. జగన్ ఓడితేనే తనకు భవిష్యత్తు ఉంటుందని భావించారు. ఆమె ఊహించిన మాదిరిగానే జగన్ ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ వైపు వైసీపీ నేతలు చూడడం లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. సమీప దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం అవుతుందన్న ఆశ లేదు. అది జగన్ కు ప్రధాన అడ్వాంటేజ్. ఏ కారణం చేతైనా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా, ప్రత్యామ్నాయంగా ఏపీ ప్రజలకు జగన్ కనిపిస్తున్నారు. కూటమి పార్టీలకు వ్యతిరేకించిన వారు తప్పకుండా జగన్ ను ఆశ్రయించాలి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఆ అడ్వాంటేజ్ ఉంది.

    * తెలంగాణలో వర్కౌట్
    తెలంగాణలో ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్ లోకి వెళ్ళింది. కాంగ్రెస్ ను కిందకు నెట్టి రెండో ప్లేస్ కొట్టేసింది బిజెపి. కానీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పొందుతుంది. అదే బిజెపిని అధిగమించి ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది. బిఆర్ఎస్ రెండో ప్లేస్ లోకి వచ్చింది. బిజెపి మూడో ప్లేస్ కు పరిమితమైంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం సీన్ మారింది. బిఆర్ఎస్ ను బిజెపి అధిగమించింది. కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించింది. అయితే ఆ పరిస్థితి ఏపీలో ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షంగా వైసీపీకి తప్ప మరొకరికి అవకాశం లేదు. సో వైసీపీని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం అంత సులువు కాదు.