BJP: బీజేపీ ప్రధాని అభ్యర్థి మళ్లీ ఆయనే.. జాతీయ కార్యవర్గ భేటీలో ఎన్నిక

ఢిల్లీలోని భారత మండపం వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Written By: Raj Shekar, Updated On : February 18, 2024 2:34 pm

BJP

Follow us on

BJP: మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. జాతీయ పార్టీలు ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు వరుసగా ఇండియా, ఎన్డీఏ కూటములుగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇండియా కూటమిలోని పార్టీలు బయటకు వస్తున్నాయి. ఎన్డీఏలో కొత్త పార్టీలు చేరుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతాపార్టీ దేశరాజధాని ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ప్రత్యేక ఎజెండా ఖరారు చేస్తోంది.

భారత్‌ మండపం వేదికగా..
ఢిల్లీలోని భారత మండపం వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు.

మోదీకి సన్మానం..
రెండో రోజు సమావేశం ఆదివారం(ఫిబ్రవరి 18న) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీని నేతలు సన్మానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జేపీనడ్డా మోదీ నిలువెత్తు పూలమాలతో సత్కరించారు. మోదీజీకి జై.. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.

ఆయనే మళ్లీ ప్రధాని..
అనంతరం సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నామని అమిత్‌షా తెలిపారు. మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మూడోసారి మోదీ దేశానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశానికి 15 మంది ప్రధాన మంత్రులు అయ్యారని, ఎన్నడూ జరగనంత అభివృద్ధి మోదీ హయాంలో జరిగిందని పేర్కొన్నారు.