దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. అందువల్లే పేరున్నప్పుడే.. ప్రఖ్యాతి సొంతం చేసుకున్నప్పుడే నాలుగు డబ్బులు వెనుకేసుకోవాలని సెలబ్రిటీలు భావిస్తున్నారు. అందువల్లే వ్యాపారం లోకి అడుగుపెడుతున్నారు. అయితే సెలబ్రిటీలు వ్యాపారం లోకి ప్రవేశించడం మన దేశంలో కొత్త కాదు ఇప్పుడు ఈ జాబితాలోకి టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోని చేరిపోయాడు.
మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియాలో అత్యంత విజయవంతమైన సారథి. టీమ్ ఇండియాకు 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచకప్ లు అందించాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. అందువల్లే ధోనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. టీమిండియా నుంచి బయటికి వచ్చిన తర్వాత ధోని ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల చెన్నై జట్టుకు తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. అంతేకాదు తన వయసును సైతం లెక్కచేయకుండా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. చేసింది తక్కువ పరుగులే అయినప్పటికీ.. ఉన్నంతసేపు ప్రేక్షకులను అలరించాడు. తన అభిమానులను ఆకట్టుకున్నాడు.
ధోని క్రికెట్ మాత్రమే కాదు.. మంచి పెట్టుబడిదారుడు కూడా. కాకపోతే ఇప్పటివరకు నేరుగా ఏ వ్యాపారం లోకి ధోని ప్రవేశించలేదు. పలు సంస్థల్లో అతడికి పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ధోని నేరుగా వ్యాపారం లోకి ప్రవేశిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. ధోనిని అభిమానులు కెప్టెన్ కూల్ అని పిలుస్తుంటారు. దాని ట్రేడ్ మార్క్ కోసం ధోని రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దీనికోసం ఇతరులు కూడా దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రాథమిక పరిశీలనలో ట్రేడ్ మార్క్ ను ధోనికి అప్పగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తుది రిజిస్ట్రేషన్ కోసం ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు.
ధోనికి ద్విచక్ర వాహనాలు అంటే చాలా ఇష్టం. ఆవులు, గేదెలు అన్నా కూడా చాలా ఇష్టం. పైగా అతడు వ్యవసాయాన్ని చేయడాన్ని ఇష్టపడుతుంటాడు. అందువల్లే అతడు తన ట్రేడ్ మార్క్ మీద వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తాడని ప్రచారం జరుగుతోంది.. మరోవైపు హోటల్ బిజినెస్ లో కూడా వచ్చే అవకాశం లేకపోలేదని కొంతమంది మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే దీనిపై ధోని అధికారికంగా ప్రకటన వెల్లడించాల్సి ఉంది. ధోనికి ఈ రంగాలు మాత్రమే కాకుండా వెంచర్ క్యాపిటల్ కూడా చాలా ఇష్టం. బహుశా దానిని కూడా ఏర్పాటు చేసే అవకాశం లేక పోలేదని తెలుస్తోంది.
ధోనికి వ్యాపారం చేయడం చిన్నప్పటి నుంచి ఇష్టం. కాకపోతే దానిని క్రికెట్ అధిగమించింది. అందువల్లే అతడు క్రికెటర్ అయ్యాడు. చివరికి టీమిండియాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బంటు లాగా వచ్చి రాజులాగా వెళ్లిపోయాడు. టీమిండియా చరిత్రలో అద్భుతమైన విజయాలను అందించి.. ఘన కీర్తిని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు వ్యాపారంలో కూడా ధోని అటువంటి కీర్తిని సొంతం చేసుకోవాలని అభిమానులు పేర్కొంటున్నారు.