https://oktelugu.com/

MI Vs CSK: క్షణం క్షణం ఉత్కంఠ.. సీట్ ఎడ్జ్ మ్యాచ్ అంటే ఇది..

MI Vs CSK క్షణం క్షణం ఉత్కంఠ.. బంతి బంతికి మారిన సమీకరణం. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసిన వేళ.. బ్యాటర్లు ఆత్మ రక్షణ ధోరణిలో ఆడిన వేళ.. ఐపీఎల్ మూడో మ్యాచ్ ప్రేక్షకులకు అసలు సిసలైన టి20 మజా అందించింది.

Written By: , Updated On : March 24, 2025 / 08:19 AM IST
MI Vs CSK (1)

MI Vs CSK (1)

Follow us on

MI Vs CSK: చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (MIvsCSK) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలు సిసలైన టి20 మజా అందించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పరుగుల వరద పారిస్తే.. చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్లు పండగ చేసుకున్నారు. ఓ మోస్తరు స్కోర్ నమోదైన మ్యాచ్లో బౌలర్లు ప్రారంభం నుంచి చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఈ మ్యాచ్లో ముంబై ఓడింది.. చెన్నై గెలిచింది అనేకంటే.. ప్రేక్షకులకు అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అందించింది అనడం సబబు. ఐపీఎల్ లో పరుగుల వరద పారుతూ ఉంటుంది. బౌలర్లకు నరకం కనిపిస్తూ ఉంటుంది. బ్యాటర్లకు కొడుతున్నా కొద్దీ ఊపు వస్తూ ఉంటుంది. కానీ అరుదైన సందర్భంలో మాత్రం బౌలర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అంతేకాదు అసలైన క్రికెట్ ఆనందాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. ఆదివారం రాత్రి చిదంబరం స్టేడియం వైదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలాంటిదే.. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు తరఫునుంచి నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టి ముంబై జట్టు పతనాన్ని శాసించారు. ముంబై జట్టును 155 పరుగులకే కట్టడి చేశారు.

Also Read: నిజమే SRH నిప్పు కణం లాగానే ఆడింది.. గూస్ బంప్స్ వీడియో

చెన్నై జట్టుకు సులభం కాలేదు

156 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన చెన్నై జట్టుకు గెలుపు అంత సులభంగా దక్కలేదు. ముంబై జట్టు ఏ దశలోనూ మ్యాచ్ పై పట్టు కోల్పోవడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా విగ్నేష్ పుతూర్ తనదైన మ్యాజికల్ డెలివరీలు వేస్తూ.. చెన్నై జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్, శివం దుబే, దీపక్ హుడా వంటి ప్లేయర్లను వెనక్కి పంపించాడు. మరోవైపు విల్ జాక్స్, దీపక్ చాహర్ చెరో వికెట్ సాధించారు. కీలక సమయంలో చెన్నై జట్టు వికెట్లు కోల్పోవడంతో.. ఒకానొక దశలో ఓడిపోతుందా? అనే సందేహం అందరిలో కలిగింది. అయితే ఓపెనర్ రచిన్ రవీంద్ర (65*) చివరి వరకు క్రీజ్ లో ఉండడంతో చెన్నై జట్టు గెలవగలిగింది. రుతు రాజ్ గైక్వాడ్(53) సత్తా చాటినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు రాహుల్ త్రిపాటి (2), శివం దుబే (9), దీపక్ హుడా (3), సామ్ కరణ్(4) వంటి వారు విఫలం కావడంతో చెన్నై జట్టుపై ఒత్తిడి పెరిగింది. వీరంతా కూడా కీలక దశలో అవుట్ కావడంతో ముంబై బౌలర్లు మ్యాచ్ పై పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడింది. అయితే మరో ఎండ్ లో రచిన్ రవీంద్ర ఉండడంతో.. చెన్నై జట్టు విజయం సాధించగలిగింది. రవీంద్ర జడేజా (17) రన్ అవుట్ అయిన నేపథ్యంలో.. ఏడో నెంబర్ ఆటగాడిగా ధోని మైదానంలోకి వచ్చాడు. అతడు మైదానంలోకి రాగానే చెన్నై అభిమానులు ఈలలు వేస్తూ గోలలు చేశారు. అయితే అప్పటికి చెన్నై జట్టు విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉంది. దీంతో విన్నింగ్ షాట్ ధోని కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు రెండు బంతులు ఎదుర్కొన్నప్పటికీ.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో చివరి ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. చెన్నై జట్టుకు సొంతమైదానంలో విజయాన్ని అందించాడు.. మొత్తంగా హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు చెన్నై, ఇటు ముంబై జట్ల మధ్య పోరు కొదమసింహాల పోరాటం లాగా అనిపించింది.