Lionel Messi And Cristiano Ronaldo: సాకర్ ఫీవర్ ప్రపంచాన్ని మొత్తం ఊపేస్తోంది. ఇందులో భారతదేశం కూడా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులు అభిమానులకు సరికొత్త ఫుట్ బాల్ మజాను అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా హై టెన్షన్ లో సాగుతోంది. కొన్ని మ్యాచ్లు డ్రా అవుతున్నప్పటికీ.. పేరుపొందిన జట్లు కూడా.. చిన్నచిన్న జట్ల చేతిలో ఓడిపోవడం.. లేదా డ్రా గా ముగించడంతో.. సాకర్ కప్ మీద ఉత్కంఠ తార స్థాయికి చేరుతోంది.
ఫేవరెట్ గా రంగంలోకి దిగిన అనేక జట్లు ఇప్పటివరకు తమ స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోతున్నాయి. అండర్ డాగ్ గా రంగంలోకి దిగిన జట్లు అదరగొడుతున్నాయి. అంచనాలకు మించి ఆటతీరుతో సత్తా చూపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సాగిన సాకర్ పోటీలు ఒక ఎత్తు.. ఇప్పుడు జరగబోయే పోటీలు మరొక ఎత్తు. ఎందుకంటే, ఇప్పుడు అసలు సిసలైన ఆటగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. వారు దిగితే చాలు మైదానాలు హోరెత్తిపోతాయి. రికార్డులు గల్లంతయిపోతాయి. చూస్తున్న ప్రేక్షకులకు నరాలు కట్ అయిపోతాయి.
ఫుట్బాల్ టోర్నీకి సరికొత్త ఆకర్షణ తీసుకొచ్చే ఆటగాళ్లలో మెస్సి, రొనాల్డో ముందు వరసలో ఉంటారు.. వీరు ఇప్పటివరకు ఈ సాకర్ కప్పులో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే బుధవారం వీరు రంగంలోకి దిగుతున్నారు.. మెస్సి అర్జెంటీనా తరఫున ఆడబోతున్నాడు. ఈ జట్టు తన తొలి మ్యాచ్లో అల్జీరియాతో పోటీ పడబోతోంది.. రొనాల్డో పోర్చుగల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ జట్టు డిఆర్ కాంగోతో పోటీ పడబోతోంది.
అర్జెంటీనా డిపెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈ జట్టు విజయం మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు.. మరోవైపు ఈ సాకర్ కప్ లో అర్జెంటీనా స్థాయిలో కాకపోయినప్పటికీ.. పోర్చుగల్ కూడా బలమైన జట్టే.. కాంగో జట్టును సులువుగానే ఓడించగలుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ ల ప్రకారం చూస్తే ఏ జట్టు కూడా అంత సులువుగా లేదు. ఇటీవల మాజీ ఛాంపియన్ స్పెయిన్ జట్టును కాబో వెర్ డే నిలువరించింది.
ఈ ప్రకారం చూసుకుంటే అర్జెంటీనాకి.. పోర్చుగల్ జట్టుకు ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే మెస్సి, రొనాల్డో ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ప్లేయర్లకు మనదేశంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆ మధ్య మెస్సి మనదేశంలో పర్యటించాడు. పశ్చిమ బెంగాల్లో అతని కోసం ఒక స్టాట్యూ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెస్సి సందడి చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగాడు. ఒక మ్యాచ్ కూడా ఆడాడు.
