IPL2025 : ఐపీఎల్ లో మిగతా అన్నిటికంటే పంజాబ్ జట్టు నేపథ్యం భిన్నమైనది. ఎందుకంటే తొలి సీజన్లో పంజాబ్ జట్టు సెమిస్ వెళ్ళింది. కానీ ఓటమి పాలై నిరాశతో ఇంటికి వచ్చింది. ఇక రెండు లేదా మూడు సీజన్లకు ఒక కెప్టెన్ ను నియమించుకుంది.. ప్లేయర్లు కూడా అలానే మారిపోయారు. 2014లో అగ్రస్థానానికి చేరుకుంది. కానీ ఫైనల్లో ఓడిపోయింది. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు టాప్ -2 లోకి వెళ్ళింది పంజాబ్. ఈసారి పంజాబ్ జట్టు 14 మ్యాచ్లు ఆడింది. ఇందులో తొమ్మిది విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. వాస్తవానికి ఆ మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే కచ్చితంగా పంజాబ్ విజయం సాధించేది. అయితే గత కొద్ది సీజన్లుగా చివరి స్థానంలో ఉన్న పంజాబ్ ఈసారి ఏకంగా టాప్ లోకి రావడానికి ప్రధాన కారణం ఒకరు కోచ్ పాంటింగ్, మరొకరు కెప్టెన్ అయ్యర్. వాస్తవానికి ఈ ఐపీఎల్ ఎడిషన్ మొదలు కాకముందే పంజాబ్ విజయ యాత్ర షురూ అయింది. కెప్టెన్ మాత్రమే కాకుండా,.మిగతా ప్లేయర్ల విషయంలోనూ పంజాబ్ జట్టు విపరీతమైన ధైర్యాన్ని చూపించింది. కెప్టెన్ , పాంటింగ్ కు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చింది. అతడు జట్టును తిరుగులేని స్థాయిలో నిలిపాడు.
Also Read : ఆర్సీబీ ఈరోజు టాప్ లేపుతుందా.. ఈసారి కప్ కొడుతుందా?
జట్టు అద్భుతంగా ఆడేందుకు పాంటింగ్ అనేక వ్యూహాలను రచించాడు. వాటిని అమల్లో పెట్టాడు.. ముఖ్యంగా శశాంక్, అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం పాంటింగే. వారిద్దరు ప్రస్తుత సీజన్ లో అద్భుతంగా ఆడుతున్నారు. శశాంక్ సింగ్ ఏకంగా టాప్ -2 లోకి వెళ్తామని ముందుగానే చెప్పాడు.. ఇక గత సీజన్లో కోల్ కతాను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈసారి పంజాబ్ ని కూడా అదే స్థాయిలో ముందుకు నడిపిస్తున్నాడు. గత సీజన్లో కోల్ కతా ను విజేతగా నిలిపినప్పుడు ఆ ఘనత మొత్తం కూడా గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. కానీ ఎప్పుడైతే అయ్యర్ పంజాబ్ జట్టులోకి వచ్చాడో.. అప్పటినుంచి అతని పేరు మార్మోగడం ప్రారంభమైంది. స్టార్ ప్లేయర్లను కాకుండా పంజాబ్ జట్టులోకి యంగ్ ప్లేయర్లను తీసుకున్నాడు అయ్యర్. ప్రభ్ సిమ్రాన్ సింగ్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్ వంటి ప్లేయర్లను తీసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో అర్ష్ దీప్ సింగ్, యాన్సెన్, వైశాఖ్ విజయ్ కుమార్ వంటి వారు కీలకంగా మారారు. సారధిగా జట్టును అయ్యర్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలే పరమావధిగా అతడు ముందుకు సాగుతున్నాడు. అందుకే పంజాబ్ జట్టు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తున్నది.
ముఖ్యంగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో తను వన్ డౌన్ లో రాకుండా ఇంగ్లిస్ ను పంపించి.. అతనితో కీలక ఇన్నింగ్స్ ఆడించాడు అయ్యర్. దీంతో ముంబై జట్టు బౌలర్లు అతడిని తట్టుకోలేక చేతులెత్తేశారు. అతడు, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసానికి పరాకాష్టలు లాగా బ్యాటింగ్ చేయడంతో.. ముంబై జట్టు పప్పులు ఉడకలేదు. దీంతో పంజాబ్ జట్టు విజయం సాధించి ఏకంగా టాప్ -2 లోకి వెళ్లిపోయింది. వాస్తవానికి పంజాబ్ జట్టు తరఫున ఆరెంజ్ విభాగంలో ఏ ఒక్క ఆటగాడు కూడా లేడు. అని ఆ జట్టు టాప్ ప్లేస్ లో ఉంది. దీనిని బట్టి జట్టు కోసం ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి కేవలం జట్టు ప్రయోజనాల కోసమే వారు వీరోచితమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు.