Pakistan ready for peace talks: జమ్మూ కశ్మీర్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకలు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 9 ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసింది. తర్వాత పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగడంతో భారత్ వాటిని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. దీంతో ఆందోళనతో సీజ్‌ఫైర్‌కు వచ్చింది. తాజాగా శాంతి మంత్రి జపిస్తోంది.
భారతదేశం దౌత్యపరంగా, సైనికపరంగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇరాన్‌లో జరిగిన ఒక కీలక సమావేశంలో, కశ్మీర్‌తోసహా దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధమని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన పాకిస్తాన్ దౌత్య ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో వెలువడటం గమనార్హం. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై గట్టిగా పోరాడుతూ, పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ఈ ప్రకటన ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది.
భారత్ దౌత్య యుద్ధం..
భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ’ఆపరేషన్ సింధూర్’ ద్వారా సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం, పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని కూడా తీవ్రతరం చేసింది. పాకిస్తాన్ రాయబారులను వెనక్కి పంపడం, ఉగ్రవాదానికి పాక్ మద్దతును అంతర్జాతీయంగా బహిర్గతం చేయడం వంటి చర్యల ద్వారా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. 33 దేశాలలో భారత ఎంపీల బృందాలు పర్యటిస్తూ, పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టాయి. అగ్రరాజ్యాలతో సహా పలు దేశాలు భారత్ వైపు నిలిచాయి, ఇంకా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు నిధులు అందించవద్దని భారత్ విజ్ఞప్తి చేసింది.
ఇరాన్ వేదికగా శాంతి ప్రతిపాదన
టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జరిపిన చర్చల సందర్భంగా ఈ శాంతి ప్రతిపాదన వెలువడింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీమ్ మునీర్ కూడా పాల్గొన్నారు. భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, గాజా సంక్షోభం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు పాకిస్తాన్ పత్రిక ‘ది డాన్’ పేర్కొంది. షరీఫ్ తన ప్రకటనలో, కశ్మీర్, ఉగ్రవాదం, నీటి పంపకం, వాణిజ్యం వంటి అన్ని వివాదాస్పద అంశాలపై సామరస్యపూర్వక చర్చలకు సిద్ధమని, పాకిస్తాన్ శాంతి కోసం చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇరాన్ ఈ ప్రతిపాదనను స్వాగతించి, భారత్–పాక్ మధ్య వివాదాలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
భారత్ స్పందన..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శాంతి చర్చల ప్రతిపాదనపై స్పందిస్తూ, చర్చలు జరిగినా అవి పరిమిత అంశాలకే పరిమితమవుతాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆధీనంలోని కశ్మీర్ (పీవోకే), ఉగ్రవాదంపై దృష్టి సారించే అంశాలపై మాత్రమే చర్చలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో, భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి వైఖరిని కొనసాగిస్తోంది. ఈ దాడి భారత్–పాక్ సంబంధాలలో మరో సంక్షోభాన్ని సష్టించింది, దీని ఫలితంగా భారత్ తన దౌత్య ఒత్తిడిని మరింత ఉధృతం చేసింది.
శాంతి చర్చల సాధ్యాసాధ్యాలు
భారత్–పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు చరిత్రలో అనేకసార్లు ప్రయత్నించబడ్డాయి, అయితే ఉగ్రవాదం, కశ్మీర్ వివాదం వంటి అంశాలు ఎల్లప్పుడూ అడ్డంకిగా నిలిచాయి. 1999లో లాహోర్ ఒప్పందం, 2001లో ఆగ్రా శిఖరాగ్రం వంటి ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో, పాకిస్తాన్ తాజా శాంతి ప్రతిపాదనను భారత్ అనుమానంతోనే చూస్తోంది. అయితే, అంతర్జాతీయ ఒత్తిడి, ఇరాన్ వంటి దేశాల మధ్యవర్తిత్వం ఈ చర్చలకు కొత్త ఊపును తెచ్చే అవకాశం ఉంది.