CSK Ball Tampering
IPL 2025 : ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఆదివారం తలపడ్డాయి. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ముందుగా ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ దుమ్ము లేపారు. వీరిద్దరి ధాటికి ముంబై జట్టు వణికిపోయింది. బలమైన ఆ జట్టు బెంబేలెత్తిపోయింది. నూర్ మహమ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఖలిల్ అహ్మద్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. దీంతో చెన్నై జట్టు ముంబై పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బలమైన ముంబై జట్టును కేవలం 155 పరుగులకే కట్టడి చేసిన చెన్నై జట్టు.. ఆ తర్వాత 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ లో బలమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ ను అంతే బలమైన చెన్నై సూపర్ కింగ్స్ వడగొట్టింది. ఈ రెండు జట్ల మధ్య కొదమసింహాల పోరాటం మాదిరిగా మ్యాచ్ జరిగింది.. బ్యాటర్లు పండగ చేసుకోవాల్సిన సందర్భంలో బౌలర్లు దుమ్మురేపారు.
Also Read : ఫస్ట్రేషన్ తగ్గలేదా రోహిత్తూ.. ఎందుకిలా ఆడుతున్నావ్?
ట్యాంపరింగ్ ఆరోపణలు..
చెన్నై జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద్ ముంబై తో జరిగిన మ్యాచ్లో దుమ్ము లేపాడు. రోహిత్ శర్మ, రికెల్టన్, బౌల్ట్ వంటి ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను సున్న పరుగులకే అవుట్ చేసి ఖలీల్ అహ్మద్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. రోహిత్ త్వరగా అవుట్ కావడం ముంబై ఇండియన్స్ స్కోరును తీవ్రంగా ప్రభావితం చేసింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఖలీల్ అహ్మద్ తన జేబులో నుంచి ఏదో పేపర్ తీశాడు. దానిని బంతికి పదేపదే రుద్దాడు. ఆ తర్వాత చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ వచ్చాడు. ఖలీల్ అహ్మద్ ఇచ్చిన పేపర్ ను తన జేబులో పెట్టుకున్నాడు. అయితే వీరిద్దరూ బంతి ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని ముంబై అభిమానులు ఆరోపిస్తున్నారు.. వీరిద్దరిని ఐపీఎల్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరూ జేబులో నుంచి పేపర్ తీసిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై అదే స్థాయిలో చెన్నై అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ విషయం ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కాని.. స్పోర్ట్స్ వర్గాల్లో మాత్రం విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించిందని.. దర్యాప్తు కూడా మొదలుపెట్టిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : తెలుగోడు నిలబడకపోయి ఉంటే ముంబై ఇజ్జత్ మొత్తం పోయేది..