IPL 2024 : నిన్నటి నుంచి ఒకటే చర్చ.. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. ఏం చేస్తాడు? మైదానంలోకి దిగుతాడా? మెంటార్ గా ఉంటాడా? లేక హెడ్ కోచ్ బాధ్యత తీసుకుంటాడా? ఇన్ని ప్రశ్నల మధ్య.. అనేకమంది సందేహాలకు సమాధానంగా.. జులపాల జుట్టుతో ధోని మైదానంలోకి దిగాడు. పేరుకు తన శిష్యుడు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయినప్పటికీ.. కథ మొత్తం ధోని ముందుండి నడిపించాడు. తనను విజయవంతమైన కెప్టెన్ ఎందుకంటారో మరోసారి నిరూపించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు డు ప్లెసిస్ బ్యాటింగ్ ధాటికి నాలుగో ఓవర్ లోనే 40 పరుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రుతురాజ్ ధోని వద్దకు వెళ్లాడు. కొంతసేపు మాట్లాడాడు. ధోని సూచనతో మస్తాఫిజూర్ కు బౌలింగ్ ఇచ్చాడు. అంతే నాలుగో ఓవర్లో బెంగళూరు కథ మొత్తం మారింది. నాలుగవ ఓవర్ రెండవ బంతికి డు ప్లెసిస్ కొట్టిన షాట్ ను రచిన్ రవీంద్ర పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు.. అదే ఓవర్లో ఐదవ బంతికి రజత్ పాటిదార్ పరుగులేమి చేయకుండానే కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం మరుసటి ఓవర్ దీపక్ చాహర్ కు ఇవ్వాలని గైక్వాడ్ కు సూచించాడు. ధోని చెప్పినట్టుగానే గైక్వాడ్ చాహర్ కు బౌలింగ్ ఇచ్చాడు.. అంతే బెంగళూరు కథ మరోసారి టర్న్ తీసుకుంది.
5 ఓవర్లో చాహర్ వేసిన బంతి నేరుగా దూసుకురావడంతో.. బెంగళూరు కీలక బ్యాటర్ మాక్స్ వెల్ తికమక పడ్డాడు. అనవసరంగా బ్యాట్ ను ఊపడంతో అది అంచుకు తగిలి కీపర్ ధోనీ చేతుల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మాక్స్ వెల్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో బెంగళూరు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కీలక ఆటగాళ్లు ఇంకా మిగిలి ఉండటంతో ధోని మరో ఎత్తులు వేశాడు.
ముస్తా ఫిజుర్ కు మళ్లీ బౌలింగ్ ఇచ్చి.. ప్రమాదకరమైన కోహ్లీని, గ్రీన్ ను అవుట్ చేశాడు. 11 ఓవర్ లో ముస్తా ఫిజుర్ కోహ్లీ, గ్రీన్ ను అవుట్ చేసి బెంగళూరు జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇలా అందుబాటులో ఉన్న బౌలర్లను ఉపయోగించుకుంటూ ధోని బెంగళూరు జట్టును 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయేలా చేశాడు. వాస్తవానికి చెన్నై జట్టుకు గైక్వాడ్ కెప్టెన్ గా ఎంపికైన తర్వాత చాలామంది ధోని ఏం చేస్తాడనే సందేహాలు వెలిబుచ్చారు. కానీ తన పాత్ర ఏమిటో.. శుక్రవారం ప్రారంభ మ్యాచ్ లో అందరికీ అర్థమయ్యేలా ధోని చెప్పాడు. క్రికెట్ల వెనుక ఉండి.. చెన్నై బౌలర్లను ముందుండి నడిపించాడు. ధోని సలహాలు విని గైక్వాడ్ ఆచరణలో పెట్టాడు తప్ప.. ఎందుకు అని ఎదురు ప్రశ్నించలేదు. ఎందుకంటే గురువు దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఆ విషయం తెలుసు కాబట్టే గైక్వాడ్ తలవంచాడు. సొంత మైదానంలో చెన్నై జట్టు అభిమానులను కాలర్ ఎగరేసేలా చేశాడు. చెన్నై జట్టును ధోని నడిపిస్తున్న తీరు చూసిన తర్వాత.. ఎవడయ్యా చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్నాడన్నది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.