India Women Team Vs Australia T20 Series Win: ఆస్ట్రేలియా జట్టు అంటే ఒకప్పుడు భారత మహిళల జట్టు భయపడేది. ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోలేక ఇబ్బంది పడేది. అందువల్లే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే టీమిండియా ఓటమి ఖాయమని క్రీడా విశ్లేషకులు ముందుగానే ఒక అంచనాకొచ్చేవారు. అయితే ఇప్పుడు టీమిండియా పూర్తిగా మారిపోయింది. ఒకరకంగా 2.0 అన్నట్టుగా ఆడుతున్నది.
హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా దూకుడును కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు మీద అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 300+ భారీ టార్గెట్ కూడా టీమిండియా ఫినిష్ చేసింది. జెమీమా అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాను గెలిపించింది. అదే ఊపు ఫైనల్ లో కూడా టీమిండియా చూపించింది. తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ సాధించింది.
వన్డే వరల్డ్ కప్ ఏదో అదృష్టవశాత్తు రాలేదని టీమిండియా నిరూపిస్తోంది. స్వదేశంలో శ్రీలంక జట్టుతో జరిగిన సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. వరుసగా స్వదేశంలో 11 t20 సిరీస్ లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి అంటే ఏంటో చూపించింది.
శనివారం ఆడి లైడ్ వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. త ద్వారా టీమిండియా 2016 తర్వాత ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 10 సంవత్సరాల అనంతరం టీమిండియా సిరీస్ గెలవడం పట్ల మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్మృతి, జెమీమా వంటి వారు ఈ సిరీస్ లో సూపర్ ఫాం కనబరిచారు. అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ వంటి వారు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడం ద్వారా టీమ్ ఇండియా సరికొత్తగా కనిపిస్తోంది. 2.0 ఆట తీరుతో ఆకట్టుకుంటున్నది.