India Vs Sri Lanka Asia Cup 2025 Suryakumar Yadav: అధికారం అనేది ముళ్ళ కిరీటం. బాధ్యత అనేది మరింత భారం.. ఓ ఫ్రెంచ్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ఈ అనువాదం టీమిండియా టి20 సారథి సూర్యకుమార్ యాదవ్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే సారధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతడు నాయకుడిగా ఓకే. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోతున్నాడు. దూకుడుగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఒకప్పటి మాదిరిగా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించలేక పోతున్నాడు.
ప్రస్తుత ఆసియా కప్ లో లీగ్ దశలో పాకిస్తాన్ జట్టు మీద చేసిన 40+ పరుగులే అతడి టాప్ స్కోర్ అంటే.. బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూపర్ 4 పోరు లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. పాకిస్తాన్ మీద తేలిపోయాడు. బంగ్లాదేశ్ మీద కూడా అంతే. చివరికి శ్రీలంక జట్టుపై కూడా అదరగొట్టలేకపోయాడు. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు సూర్య కుమార్ యాదవ్ కు బౌలింగ్ ఎలా వేయాలో తెలియక బౌలర్లు తెగ ఇబ్బంది పడేవారు. ఎక్కడ బంతులు వేస్తే ఎలా కొడతాడో తెలియక ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి సూర్యకుమార్ యాదవ్ కు వచ్చింది. బంతిని ఎదుర్కోవడంలో సూర్య కుమార్ యాదవ్ తికమక పడుతున్నాడు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దారుణమైన షాట్లు ఆడి విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవాల్సి ఉంది.
పాకిస్తాన్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ కాబట్టి.. ఇప్పటికే సూపర్ 4 మ్యాచ్ లో విఫలమయ్యాడు కాబట్టి సూర్యకుమార్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని సూర్యకుమార్ యాదవ్ జయించాల్సి ఉంది. సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు సూర్య కుమార్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని బంతులు వేశారు. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే తీరుగా వారు బౌలింగ్ వేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటప్పుడు పాకిస్తాన్ బౌలర్లకు సూర్య కుమార్ యాదవ్ ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. అదే ప్రయోగాన్ని పాకిస్తాన్ బౌలర్లు ఫైనల్ మ్యాచ్లో కూడా చేసే అవకాశం ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సూర్య కుమార్ యాదవ్ తన కెప్టెన్సీ గ్రహణాన్ని తొలగించుకోవాలి. కెప్టెన్సీని భారంగా కాకుండా.. బాధ్యతగా భావించాలి. అప్పుడే అతడి నుంచి ఉత్తమమైన ఇన్నింగ్స్ వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.