Ind Vs Nz 2nd Test: అక్షర్ పటేల్ ను కాదని.. అతడిని టీమిండియాలోకి తీసుకుంటే అందరూ నవ్వారు.. ఇప్పుడేమో ఏడు వికెట్లు పడగొట్టి అతడు నవ్వుతున్నాడు..

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ను భారీ స్కోర్ చేయకుండా టీమిండియా కట్టడి చేసింది. 259 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. స్పిన్ బౌలింగ్ కు స్వర్గధామమైన పూణే మైదానంపై రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ మొత్తం పది వికెట్లు పడగొట్టారు. అశ్విన్ 3 వికెట్లు దక్కించుకోగా.. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు సాధించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 24, 2024 5:16 pm

Ind Vs Nz 2nd Test(4)

Follow us on

Ind Vs Nz 2nd Test: తొలి టెస్ట్ ను టీమిండియా కోల్పోయింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా పూణేలో జరుగుతున్న రెండో టెస్టుకు పకడ్బందీగా బరిలోకి దిగింది. రాహుల్, కులదీప్ యాదవ్, సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చింది. వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, గిల్, ఆకాష్ దీప్ కు స్థానం కల్పించింది. ఇందులో గిల్, ఆకాష్ దీప్ విషయంలో పెద్దగా విమర్శలు రాలేదు. వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకోవడం పట్ల చాలామంది నొసలు చిట్లించారు. అసలు అతడికి అవకాశం ఎందుకు ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అతడు పెద్దగా ఆడటం లేదని.. అతడి స్థానంలో ఇంకెవరికైనా అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శకులందరికీ వాషింగ్టన్ సుందర్ తన ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు. స్పిన్ కు సహకరిస్తున్న పూణే మైదానంపై బంతిని గింగిరాలు తిప్పాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో తాను ఇలాంటి బౌలర్ నో.. తనను ఎందుకు ఎంపిక చేశారో విమర్శకులందరికీ అదిరిపోయే సమాధానం చెప్పాడు.

పటిష్ట స్థితి నుంచి

న్యూజిలాండ్ జట్టు ఒకానొక దశలో 58 ఓవర్లకు 197/3 వద్ద పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఆ సమయంలో రచిన్ రవీంద్ర (65), దారిల్ మిచెల్ (18) క్రీజ్ లో ఉన్నారు. 59 వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్.. తొలి బంతికే రచిన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్లండెల్ ( 3) ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సాంట్నర్(33), సౌతి(5), ఆజాజి పటేల్(4) ను కూడా క్లీన్ బౌల్డ్ చేసి న్యూజిలాండ్ ఆట కట్టించాడు. మధ్యలో సాంట్నర్ కనుక 33 పరుగులు చేయకపోయి ఉంటే న్యూజిలాండ్ మరింత తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయి ఉండేది. దాదాపు 45 నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన సుందర్.. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అక్షర్ పటేల్ ఉండగా.. వాషింగ్టన్ సుందర్ ఎందుకు? అని ప్రశ్నించిన వారందరికీ తన బౌలింగ్ తోనే సమాధానం చెప్పాడు . రవీంద్ర జడేజా, బుమ్రా వంటి బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్నచోట.. ఏకంగా 7 వికెట్లు సాధించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు వాషింగ్టన్ సుందర్..