Grandhi Srinivas
Grandhi Srinivas : వైసిపి పరిస్థితి మరింత తీసికట్టుగా మారుతుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. దాదాపు ఒక 50 మంది వరకు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ గా ఉన్నారు. కొందరు సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూనియర్ లు కీలక వహిస్తున్నారు. సరైన సమయం కోసం వేచి చూసిన వారు ఉన్నారు. అయితే ఎలా చూసుకున్నా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. ఏకంగా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పార్టీని వీడుతున్నారు. నిన్నటికి నిన్న మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చెప్పారు. వెళుతూ వెళుతూ జగన్ పై విమర్శలు చేశారు. ఈరోజు మేకతోటి సుచరిత విషయంలో కూడా కదలిక వచ్చింది. ఆమె సైతం పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే మరో కాపు నాయకుడు వైసీపీకి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన టిడిపిలో చేరడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పైగా సీఎం చంద్రబాబును కలిశారు. వరద బాధితులకు సాయం అందించే క్రమంలో చంద్రబాబును కలిసి చెక్ అందించారు.ప్రస్తుతం ఆయన అనుచరులతో సమావేశం అయ్యారని.. వారి అభిప్రాయం మేరకు టిడిపిలో చేరతారని తెలుస్తోంది.
* 2019లో పవన్ పై గెలుపు
గ్రంధి శ్రీనివాస్ సీనియర్ నాయకుడు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించిన నేత. ఆ ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నియోజకవర్గంలో పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. సొంత నియోజకవర్గ భీమవరంలో పవన్ ను ఓడించారు గ్రంధి శ్రీనివాస్. అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ పై గెలవడంతో గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ మాత్రం ఇవ్వలేదు. కనీసం విస్తరణలో అయినా చాన్స్ ఇస్తారని భావించారు. మంత్రి పదవి దక్కకపోయేసరికి గ్రంధి శ్రీనివాస్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. కానీ జగన్ నుంచి ఒత్తిడి ఎదురయ్యేసరికి ఒప్పుకున్నారు.
* ఇటీవల సైలెంట్
ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రంధి శ్రీనివాస్ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం మానేశారు. అనారోగ్యం సాకుగా చూపి ఏమంత యాక్టివ్ గా లేరు. కానీ సోదరులతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. వరద బాధితుల సహాయార్థం విరాళాలను అందించారు. అయితే అప్పటినుంచి గ్రంధి శ్రీనివాస్ టిడిపిలో చేరతారని ప్రచారం ప్రారంభం అయ్యింది. భీమవరంలో టిడిపిలో ఉన్న ఆంజనేయులు జనసేనలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు టిడిపికి నాయకత్వం లేదు. అందుకే టిడిపిలో గ్రంధి శ్రీనివాస్ చేరతారని.. నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. మొత్తానికైతే జగన్ కు మరో నేత షాక్ ఇవ్వనున్నారు అన్నమాట.